● అద్దె చెల్లించలేదని 13 ఏళ్లక్రితమే షాపురూమును సీజ్ చేసిన కార్పొరేషన్
● అధికార పార్టీ అండతో అక్రమంగా
ప్రవేశించిన అఫ్సర్
● కార్పొరేషన్ అధికారులు, సిబ్బందితో
తీవ్ర వాగ్వివాదం
● పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఎంసీ అధికారులు
కడప కార్పొరేషన్ : కడప నగరం మద్రాసు రోడ్డులో బాలాజీ కాంప్లెక్స్ పక్కన యునాని కాంప్లెక్స్‌లో 13 సంవత్సరాల క్రితం కడప మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ) వారు సీజ్ చేసి తాళం వేసిన అద్దె గదిలోకి అఫ్సర్‌బాష అనే వ్యక్తి దౌర్జన్యంగా ప్రవేశించారు. శని, ఆదివారాలు సెలవులు రావడంతో అతను తాళం పగులగొట్టి షాపురూములోకి ప్రవేశించి మరమ్మతు పనులు చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అధికార తెలుగుదేశం పార్టీ నేతల అండదండలతోనే అతను అంత ధైర్యంగా తాళం పగులగొట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యునాని కాంప్లెక్స్‌లో ఉన్న ఈ షాపు రూముకు అద్దె సుమారు రూ.40లక్షలు చెల్లించనందు వల్ల అనేక డిమాండ్ నోటీసులు, ఫైనల్ నోటీసులు ఇచ్చిన తర్వాత 13 ఏళ్లక్రితం అనగా 2013లో నగరపాలక అధికారులు ఈ షాపును సీజ్ చేశారు. ఇన్నేళ్ల తర్వాత దీన్ని తెరవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 17వ తేదికి నగరపాలక వర్గం గడువు కూడా ముగిసిపోనున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల భరోసాతో పక్కా ప్రణాళికతోనే గది తాళం పగులగొట్టినట్లు తెలుస్తోంది. అతను ఇదివరకే కార్పొరేషన్‌కు చెందిన మరో గదిని కూడా అక్రమించుకొని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న 31వ డివిజన్ కార్పొరేటర్ అజ్మతుల్లా మేయర్ పాకా సురేష్ దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే రెవెన్యూ అఽధికారులను అప్రమత్తం చేసి, కార్పొరేషన్ ఆస్థిని కాపాడాలని ఆదేశించినట్లు సమాచారం. అక్కడికి వెళ్లిన నగరపాలక అధికారులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో అఫ్సర్ బాష తీవ్ర వాగ్వివాదం చేసినట్లు తెలిసింది. దీంతో అఫ్సర్ బాషపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నగరపాలక కమిషనర్ రాకేష్ చంద్ర వన్‌టౌన్ సీఐకి ఫిర్యాదు చేశారు.


