కడప కార్పొరేషన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథరెడ్డి అన్నారు. సోమవారం పొట్టిశ్రీరాములు 125వ జయంతి సందర్భంగా గోకుల్ సర్కిల్‌లోని ఆయన విగ్రహానికి మేయర్ పాకా సురేష్ కుమార్‌తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు భాషా సంస్కృతి, ప్రత్యేక రాష్ట్రం కోరుతూ 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు విడిచిన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని తెలుగువారు మర్చిపోలేరన్నారు. పొట్టిశ్రీరాములు సేవలకు గుర్తుగా దివంగత వైఎస్సార్ హయాంలో గోకుల్ సర్కిల్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక తమ పాలకవర్గంలోనే పొట్టి శ్రీరాములు సర్కిల్‌ను ఆధునికీకరించి, నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివ ప్రసాద్, బంగారు నాగయ్య యాదవ్, నార్త్ జోన్ అధ్యక్షులు ఇలియాస్, కార్పొరేటర్లు అజ్మతుల్లా, బాలస్వామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీరంజన్‌రెడ్డి, ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు సీహెచ్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.


