ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి వచ్చేసే భక్తులకు నిరంతరం అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు ఆలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక నిత్య అన్నప్రసాద కేంద్రాన్ని సోమవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, టీటీడీ సీవీఎస్‌వో మురళికృష్ణ, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్దె తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిత్య అన్నప్రసాద కేంద్రం ప్రధాన ద్వారానికి ఉండే రిబ్బన్ కటింగు చేయడంతో పాటు సీతారామలక్ష్మణ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతేడాది శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి విచ్చేసే భక్తులకు నిరంతరాయంగా అందించాలని ఉద్దేశంతో అన్ని వసతులు ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక నిత్య అన్నప్రసాద కేంద్రాన్ని ప్రారంభిచినట్లు ఆయన తెలిపారు. దీనికి ముందు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలోని మూలవిరాట్ ని ఆయన దర్శించుకున్నారు.


