విద్యుత్ దీపాల అలంకరణలో మస్జీద్ ఏ నకాష్
కడప సెవెన్‌రోడ్స్: మసీదులన్నీ విద్యుద్దీప కాంతులతో ధగధగలాడాయి.. ఆ ప్రాంగణాలన్నీ ఆధ్యాత్మిక చింతనతో వెలిగిపోయాయి. పవిత్ర ఖురాన్‌లోని దైవ సందేశం గురించి వివరిస్తున్న గురువుల బోధనలతో భక్తిభావనను నింపాయి.. షబ్బే ఖద్ర్ (బడీరాత్) ప్రత్యేక ప్రార్థనలతో ఆయా ప్రాంతాలు కొత్త కళను సంతరించుకున్నాయి. రంజాన్ మాసంలోని పవిత్ర షబ్ ఏ ఖద్ర్ రాత్రి సోమవారం ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. బడీరాత్ నిర్వహణ కోసం రెండు, మూడు రోజుల ముందునుంచి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని మసీదుల్లో రాత్రి తరావీ ప్రార్థనల అనంతరం ముఖ్యఘట్టం ప్రారంభమైంది. ఈరోజున ఆధ్యాత్మిక సందేశం ఇచ్చేందుకు ఆహ్వానించిన దేశంలోని ప్రముఖ గురువులు బోధనలను ప్రారంభించారు. పవిత్ర ఖురాన్‌లోని పలు ముఖ్యమైన ఘట్టాలను వారు ఈ సందర్భంగా వివరించారు. మహా ప్రవక్త మహమ్మద్ (సొ.అ.వ) జీవితంలోని ముఖ్యమైన అంశాలు, ఆయన బోధనలను గురించి కూడా తెలియజేశారు. భక్తుల సామూహిక ప్రార్థనలు (జికర్) నిర్వహించారు. రాత్రంతా మసీదు ప్రాంగణాలలో భక్తులు పూర్తి ఆధ్యాత్మిక చింతనతో గడిపారు. దాదాపు తెల్లవారు జామున సెహరి వరకు ఈ బోధనలు కొనసాగాయి.
వెల్లివిరిసిన భక్తిభావం
రాత్రంతా ప్రార్థనలు
భక్తులతో కళకళలాడిన మసీదులు


