వల్లూరు : కడప – తాడిపత్రి ప్రధాన రహదారిలో మండల పరిధిలోని కొప్పోలు బస్టాపు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొప్పోలు ఎస్సీ కాలనీకి చెందిన పెద్దగాండ్ల బాలాజీ (27) అనే యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు సొంత పని మీద వల్లూరుకు వచ్చిన బాలాజీ ఇంటికి ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. కొప్పోలు బస్టాపు వద్ద రోడ్డు దాటుకుంటుండగా కడప నుంచి కమలాపురం వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో బాలాజీ తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు, స్థానికులు 108 వాహనంలో చికిత్స కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


