వేంపల్లె : వేంపల్లెలోని స్థానిక బలిజ సంఘం వీధికి చెందిన నామా వెంకట పూజిత్ అనే డిగ్రీ విద్యార్థి అదృశ్యమైనట్లు విద్యార్థి తల్లిదండ్రులు శ్రీనువాసులు, హేమలత తెలిపారు. వెంకట పూజిత్ కడప నగరంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం వేంపల్లె నుంచి కళాశాలకు వెళుతున్నానని ఉదయం 7 గంటలకు తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిన విద్యార్థి ఆదివారం కూడా ఇంటికి రాలేదు. తల్లిదండ్రులకు చెందిన వాట్సాప్‌లో తాను ఇంటికి రాను, ఇంట్లో వాళ్లు చెబుతున్న పనులు చేయలేనని మెసేజ్ పంపినట్లు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
ముద్దనూరు : మండల కేంద్రంలోని యానాదికాలనీకి చెందిన సుశీల(34) అనే వివాహిత మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఏఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి సమాచారం మేరకు వివరాలు..సుశీల తన భర్త నితిన్‌తో కలిసి డీఎన్‌పల్లె సమీపంలోని ఓ తోటలో కాపలాకూలీలుగా పనిచేస్తున్నారు.గత కొంత కాలంనుంచి కడపలో ఉన్న సుశీల తండ్రికి సంబంధించిన ఆస్తి విషయంలో ఆమె సోదరితో సమస్య నెలకొంది.ఈనేపథ్యంలో శనివారం రాత్రి సుశీల ఆమె భర్తతో కలసి తోట వద్ద తన తండ్రి ఆస్తివిషయంపై చర్చించి తీవ్ర మనస్థాపానికి గురైంది. అదే రోజు రాత్రి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.ఆదివారం మృతురాలి భర్త ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
నియామకం
కడప కోటిరెడ్డిసర్కిల్ : భారతీయ జనతాపార్టీకి బత్తల పవన్ కుమార్ అందించిన సేవలు గుర్తించి పార్టీ అధిష్టానం నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ కడప జిల్లా చైర్మన్‌గా నియమించింది. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ మాధవ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి, ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తానని తెలియజేశారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
సిద్దవటం : మండలంలోని భాకరాపేట గ్రామం ఎంపీపీ స్కూల్ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ హారిక మాట్లాడుతూ భాకరాపేట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడని మృతదేహాన్ని కడప రిమ్స్ మార్చురీకి తరలించామన్నారు. ఎవరైనా అతన్ని గుర్తుపడితే 9121100581, 9121100584 నంబర్లకు సమాచారం తెలపాలని ఎస్‌ఐ తెలియజేశారు.


