సిద్దవటం : అధికార పార్టీ నాయకుల కబ్జాల పర్వం తారస్థాయికి చేరింది.ఖాళీ జాగా కనపడితే చాలు అది శ్మశాన స్థలం అయినా సరే దౌర్జన్యంగా కబ్జా చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. మాధవరం ఆసుపత్రి వెనుక వైపున శ్మశాన స్థలం ఆక్రమించేందుకు ప్రయత్నించి గ్రామస్తులు ఏకమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేసరికి వెనుకడుగు వేశారు. సిద్దవటం మండలంలోని శాకరాజుపల్లి రెవెన్యూ గ్రామం మొహిద్దీన్ సాహెబ్ పల్లి మజరాలో సర్వే నంబర్ 246లో దాదాపు 24 ఎకరాలు ఉండగా ఇందులో 1.50 ఎకరాల భూమి తాడిగట్ల కుమారి పేరుతో దాదాపు 25 సంవత్సరాలుగా అనుభవంలో ఉన్న భూమిలో ఉలువ, సజ్జలను పండించేవారు. సదరు భూమి రెవెన్యూ రికార్డు 1 బీ, అడంగల్ కూడా నమోదై ఉంది. అయితే టీడీపీ అధికారంలో ఉందన్న అహకారంతో స్థానిక టీడీపీ కార్యకర్త సదరు భూమిలో కంచె వేయాలని నాటిన సిమెంట్ పోళ్లను తొలగించి ఆక్రమణకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఆరోపించారు. రెవెన్యూ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనిపై స్థానిక వీఆర్‌ఓ హరిని వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని, బాధితురాలు ఫిర్యాదు చేస్తే పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని తెలిపారు.
అడ్డుకున్న గ్రామస్తులు


