సుండుపల్లె : అక్రమంగా తరలిస్తున్న 21 ఎర్రచందనం దుంగలను ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయి అటవీ శాఖ అధికారి వై.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా అటవీ శాఖ అధికారి ఆదేశాల మేరకు రాయవరం సెక్షన్ రాయవరం క్రాస్ దగ్గర అటవీ శాఖ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక ఇన్నోవా వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా డ్రైవర్ ఆపకుండా వెళ్లాడు. అటవీ శాఖ సిబ్బంది దానిని వెంబడించి గుండ్లపల్లి సమీపంలోని గొల్లపల్లి చెరువు దగ్గర డ్రైవర్ కారును వెనుకకు మల్లించే క్రమంలో కారు బోల్తాపడింది డ్రైవర్ తప్పించుకొని పారిపోయాడు. అందులో 612 కేజీలు బరువున్న 21 ఎర్రచందనం దుంగలు, కారును అటవీ శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని వారు తెలిపారు. అలాగే జిల్లెళ్ల మంద బీట్ సమీపంలోని పోర కనుమ ప్రదేశంలో 254 కేజీల బరువున్న 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వాటి విలువ రూ.1.25 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు.


