మైదుకూరు : కంకర తయారు చేసే స్టోన్ క్రషర్ వద్ద కూలిగా పనిచేస్తున్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మైదుకూరు మున్సిపాలిటీలోని శెట్టివారిపల్లె వద్ద జరిగింది. అర్బన్ ఎస్‌ఐ చిరంజీవి శనివారం తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. శెట్టివారిపల్లెకు చెందిన నల్లిపోగు చంద్రమోహన్ (33)కు ఐదేళ్ల కిందట బద్వేలు మండలం వల్లెలవారిపల్లె గ్రామానికి చెందిన వెంకటరమణితో వివాహమైంది. ఈ యువకుడు పదేళ్లుగా శెట్టివారిపల్లెకు చెందిన కొప్పర్తి వేణురామిరెడ్డి కంకర క్రషర్‌లో పనిచేస్తున్నాడు. రోజులాగే శుక్రవారం క్రషర్ వద్దకు పనికివెళ్లాడు. సాయంత్రం 5 గటల ప్రాంతంలో క్రషర్ మిషన్ వద్ద పనిచేస్తున్న చంద్రమోహన్ తీవ్రంగా గాయపడగా అక్కడున్న వారు చికిత్స కోసం కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై మృతుని భార్య వెంకటరమణి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. మృతునికి నాలుగేళ్ల మోక్షిత, మూడేళ్ల మోహన ప్రియ అనే కుమార్తెలు ఉన్నారు.


