వేంపల్లె : వేంపల్లెలోని స్థానిక భవిత దివ్యాంగుల కేంద్రంలో పనిచేస్తున్న ఐఈఆర్టీ కె.యశోదకు అవార్డును ప్రదానం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో మహ్నవ్ ఎబిలిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన మహిళలను ఘనంగా సత్కరించారు. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 30మంది ప్రేరణాత్మక మహిళలను ఎంపిక చేసి అవార్డులను అందజేశారు. కడప జిల్లా వేంపల్లె మండలంలోని భవిత దివ్యాంగుల కేంద్రంలో పనిచేస్తున్న ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్టీ) కోటపాటి యశోద దివ్యాంగులకు చేస్తున్న సేవలను గుర్తించి ప్రతిభా అవార్డు అందజేసి సత్కరించారు. ఈ అవార్డును (సుప్రీం కోర్టు అడ్వకేట్) మాల్యాద్రి, నడింపల్లి యమునా పాఠక్ మోటివేషనల్ సైకాలజిస్ట్, ఓం స్వరూప్ స్వామిజీ, భారత్ వేదిక్ పర్యాటన నిగమ్ ట్రస్ట్ చైర్మన్ సుదర్శన్ పాఠక్, నటి మిస్ హీనా భాటియా సంజయ్ ముఖ్య అతిథులుగా హాజరై అందజేశారు.
దాడి చేయకపోయినా
తప్పుడు ఫిర్యాదు చేశారు
కడప కోటిరెడ్డిసర్కిల్ : తాము ఎవరిపై దాడి చేయకపోయినా సగిలి గుర్రమ్మ అనే మహిళ తమపై తప్పుడు ఫిర్యాదు చేశారని ఎర్రముక్కపల్లెకు చెందిన సట్టి భారవి ఒక ప్రకటనలో తెలిపారు. మా పూర్వీకుల ఆస్తిలో మా స్వాధీన అనుభవంలో ఉన్న ఇంటిని కబ్జా చేయాలని జనవరి 26వ తేదీ అర్ధరాత్రి కొందరు దుండగులు రెండు జేసీబీలతో వచ్చి దుర్మార్గంగా మా ఇంటిని కూల్చివేశారన్నారు. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, న్యాయం చేయాలని ఆందోళనలు చేశామన్నారు. వారు కూల్చివేసిన ఇంటిని తాము మళ్లీ నిర్మించుకుంటుంటే అప్పుడు దౌర్జన్యం చేసిన వారే మళ్లీ వచ్చి గోడలను, దౌర్జన్యంగా తోసివేశారన్నారు. సీపీఐకు చెందిన ఎన్. వెంకట శివ, భాగ్యలక్ష్మిలు తాము కలిసి గుర్రమ్మ అనే మహిళపై పిడిగుద్దులు కురిపించామనడం పూర్తి అవాస్తవమన్నారు. ఇదంతా కబ్జాదారుల ఎత్తుగడ అని తెలిపారు.


