ఒంటిమిట్ట : కరెంటోళ్ల జనబాటతో విద్యుత్ సమస్యలు పరిష్కారం అవుతాయని విద్యుత్ శాఖ తిరుపతి సర్కిల్ జీఎం ఎస్.శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొండమాచుపల్లి గ్రామంలో జిల్లా, మండల విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆయన కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం విద్యుత్ తీగకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను విద్యుత్ సిబ్బంది చేత తొలగించడం, విద్యుత్ వినియోగదారులను అడిగి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లూజుగా ఉన్న విద్యుత్ లైన్లను బిగిస్తామని, దెబ్బతిన్న కరెంట్ స్తంభాలను మారుస్తామని, ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద శుభ్రం చేయిస్తామన్నారు. అలాగే విద్యుత్ మీటర్లలో సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. ఏదేమైనా ప్రజలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండమాచుపల్లి సర్పంచ్ మేరువ శివనారాయణ, ఏడీ పి.సుబ్రమణ్యం, ఏఈ జయకేశవరెడ్డి, లైన్ ఇన్‌స్పెక్టర్ మహబూబ్ బాషా, లైన్ మెన్ జనార్దన్‌రెడ్డి, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


