కడప సెవెన్‌రోడ్స్ : మొల్లమాంబ సాహిత్యం, తెలుగు భాషా అభివృద్ధికి, సామాజిక చైతన్యానికి ఎంతో తోడ్పడిందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. కడప కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలోని గోపవరం గ్రామంలో కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తెలుగు కవయిత్రి అని తెలిపారు. ఎందరో కవులు శ్రీరాముని చరిత్రను వివిధ విధాలుగా రచించినప్పటికీ, సామాన్య ప్రజలకు అర్థమయ్యే సరళమైన తెలుగు వాడుక భాషలో శ్రీమొల్ల రామాయణంశ్రీను రచించడం ఆమె ప్రత్యేకత అని తెలిపారు. కవయిత్రి మొల్ల తెలుగు సాహిత్యానికి చేసిన విశిష్ట సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలు, సాహిత్య కృషి గురించి సంక్షిప్తంగా వివరించడంతో పాటు, సమాజానికి ఆమె అందించిన ప్రేరణాత్మక సందేశాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, కుల సంఘాల నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
సన్మానం
మైదుకూరుకు చెందిన రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్‌ను కలెక్టరేట్‌లో మొల్ల సాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు, భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత, విద్వాన్ గానుగ పెంట హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి జీవీ మనోజ్ కుమార్‌లు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక కలెక్టర్లు హరి ప్రసాద్, నాగరాజు, జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటసుబ్బయ్య, పుట్టపర్తి సాహితీ పీఠం ప్రధాన కార్యదర్శి జింకా సుబ్రహ్మణ్యం, ప్రముఖ అష్టావధాని లోకా జగన్నాథ శాస్త్రి, రంగస్థలం కళాకారుడు కడియంపాటి అరుణ్ ప్రసాద్, ప్రముఖ వ్యాపారవేత్త వంకధార రఘునాథ్ గుప్తా, ఎన్‌సీసీ ప్రోగ్రాం ఆఫీసర్ భూమిరెడ్డి రవి కళ్యాణ్, సిద్ధ మల్లేశ్వర ఆలయ అభివృద్ధి చైర్మన్ నాగ మల్లారెడ్డి, పుష్పగిరి గిరి ప్రదక్షిణ తీర్థధర్మ సభ్యులు నిత్య పూజ శ్రీనివాసులు, బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


