రాష్ట్రంలో రెడ్డి అధికారులపై టార్గెట్‌ పాలిటిక్స్‌? | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రెడ్డి అధికారులపై టార్గెట్‌ పాలిటిక్స్‌?

Mar 14 2026 7:48 AM | Updated on Mar 14 2026 7:48 AM

వరుస సస్పెన్షన్లు ఆందోళనకరం

ఆర్‌సీడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు

సురేంద్రారెడ్డి

పులివెందుల టౌన్‌ : రాష్ట్రంలో రెడ్డి అధికారులపై చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్‌ పాలిటిక్స్‌ చేస్తోందని ఆర్‌సీడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు యర్రపురెడ్డి సురేంద్రారెడ్డి, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లెక్కల మణికంఠరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పులివెందులలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. పోస్టింగ్‌లు లేకుండా రెడ్డి అధికారులను పక్కన పెట్టడం, అలాగే వరుసగా సస్పెన్షన్లు చేస్తుండటం ఆందోళనకరమన్నారు. గత కొంత కాలంగా అనేక మంది ఐపీఎస్‌, ఐఏఎస్‌, ఇతర ఉన్నతాధికారులకు పోస్టింగ్‌ ఇవ్వకుండా పక్కన పెట్టడం జరిగిందన్నారు. ఆ అధికారుల్లో ఎక్కువగా రెడ్డి అధికారులే ఉండటం యాదృచ్ఛికం కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇటీవల ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేయడం జరిగిందని, ఆ ఘటనల్లో కూడా రెడ్డి అధికారులే లక్ష్యంగా మారడం చాలా బాధాకరమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడైనా ఒక డీఎస్పీ స్థాయి పోస్టులో కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారి లేకపోవడం చాలా ఆందోళన కలిగించే విషయమన్నారు. పోలీస్‌ శాఖలో పని చేసిన సీఐ అశోక్‌రెడ్డిపై కూడా ఇదే విధంగా చర్యలు తీసుకోవడం మరింత ఆందోళనకరమన్నారు. పూర్తి స్థాయి విచారణ జరగకముందే రెడ్డి అధికారిపై చర్యలు తీసుకోవడం అన్యాయంగా కనిపిస్తోందన్నారు. రెడ్డి అధికారులను టార్గెట్‌ చేయడం వెంటనే ఆపాలని, ప్రతి అధికారికి సమాన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement