పది పరీక్షలకు ఏర్పాట్లు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

పది పరీక్షలకు ఏర్పాట్లు వేగవంతం

Mar 11 2026 7:47 AM | Updated on Mar 11 2026 7:47 AM

పది పరీక్షలకు ఏర్పాట్లు వేగవంతం

ఇన్విజిలేటర్ల నియామకం పూర్తి

పోలీసు స్టేషన్స్‌కు చేరుతున్న ప్రశ్నపత్రాలు

ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం

కడప ఎడ్యుకేషన్‌ : పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షల ఏర్పాట్లు ఘట్టం తుది అంకానికి చేరుకుంది. ఈ నెల 16 తేదీ నుంచి ఏప్రిల్‌ 01 వ తేదీ వరకు 167 పరీక్షా కేంద్రాలలో జరిగే ఈ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 28152 మంది పది పరీక్షలను రాయనున్నారు. ఈ పరీక్షల పర్యవేక్షణకు 167 మంది ఛీప్‌ సూపరిండెంటెంట్లు, 167 మంది డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లను నియమించారు. సంబంధిత పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు నిర్వహించనున్నారు.

ఇన్విజిలేటర్ల నియామకం గందరగోళం

పరీక్షల నిర్వహణలో ముఖ్యమైన ఇన్విజిలేటర్ల నియామకం కూడా పూర్తయింది. కాకపోతే ఈ ఏడాది జిల్లా విద్యాశాఖ నుంచి కాకుండా విజయవాడ కమిషనర్‌ కార్యాలయం నుంచే డ్యూటీల కేటాయింపు జరిగింది. ఇందులో చీఫ్‌ సూపరింటెండెంట్‌లుగా విధులు నిర్వహించాల్సిన గెజిటెడ్‌ హెడ్మాస్టర్‌లకు డిపార్ట్‌మెంట్‌ అధికారులుగా, జూనియర్లు అయిన స్కూల్‌ అసిస్టెంట్లకు చీఫ్‌ సూపరింటెండెంట్‌లుగా విధుల కేటాయింపులు జరిగాయని సంఘాలు ఆందోళన కూడా చేశాయి. అలాగే ఇంతవరకు కనీసం ఇన్విజిలేషన్‌ డ్యూటీలు నిర్వహించని వారికి నేరుగా చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంట్‌ అధికారులుగా విధులు కేటాయింపులు జరిగాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పది పరీక్షలకు సంబంధించి జిల్లాలో 1600 లకు పైగా ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిసింది.

పోలీసు స్టేషన్లకు ప్రశ్నపత్రాలు

పది పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఈ నెల 9,10 తేదీలలో జిల్లా కేంద్రమైన కడపకు చేరుకున్నాయి. 9వ తేదీన సెట్‌–1, 10వ తేదీన సెట్‌–2 ప్రశ్నపత్రాలు కడప మున్సిపల్‌ హైస్కూల్‌ మెయిన్‌కు చేరుకున్నాయి. అక్కడ నుంచి మండల కేంద్రాలలోని పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. ఆయా పరీక్షా కేంద్రాల సీఎస్‌, డీఓలు వాటిని సబ్జెక్టు, తేదీల వారీగా విభజించికుని వాటిని పోలీసు స్టేషన్లలో భద్రపరుస్తారు.

రెండు కేటగిరీలుగా పరీక్షా కేంద్రాలు కేటాయింపు

జిల్లాలోని పరీక్షా కేంద్రాలను రెండు కేటగిరిలుగా విభజించారు. ఇందులో ఏ కేటగిరి పరీక్షా కేంద్రాలుగా 101 కాగా బి కేటగిరి పరీక్షా కేంద్రాలుగా 66 కేంద్రాలను కేటాయించారు.

మెడికల్‌ కిట్లు సిద్ధం

పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఆనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య సేవలందేలా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన వైద్య సిబ్బందితోపాటు మందులను వైద్యశాఖ ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రంలో ఏఎన్‌ఎంతోపాటు ఆశా వర్కర్‌ను నియమించి ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు.

విద్యార్థులకు సూచనలు

● పరీక్షలు రాసే విద్యార్థులంతా ఉదయం 8.30 గంటల కల్లా కచ్చితంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి

● ఉదయం 8.45 నుంచి 9.30 వరకు మాత్రమే విద్యార్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తారు. ఆ తరువాత గేట్లు మూసి వేస్తారు.

● విద్యార్థులంతా హాల్‌ టికెటుపై ముద్రించిన తమ వివరాలు, పుట్టిన తేదీ, తల్లితండ్రుల పేర్లు, రాయాల్సిన సబ్జె క్టులు, పరీక్ష కేద్రంపేరు, చిరునామా సరి చూసుకోవాలి

● తప్పులుంటే ముందుగానే ప్రధానోపాధ్యాయుల ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగం దష్టికి తీసుకెళ్లి సరి చేయించుకోవాలి

● రోల్‌ నెంబర్‌ ఆధారంగా విద్యార్థి తనకు కేటాయించిన సీట్లో కూర్చున్న తరువాత ఇన్విజిలేటర్‌ ఇచ్చి బార్‌ కోడింగ్‌తో కూడిన ఓఎంఆర్‌ షీట్‌ , ప్రశ్నాపత్రం, అన్సర్‌ బుక్‌లేట్‌ అందచేస్తారు. తర్వాత ఓఎంఆర్‌ షీట్‌ పూరించే విధానంపై ఇన్విజిలేటర్‌ ఇచ్చే సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా పాటించాలి. దానిపై అనవసరమైన గీతలు, రాతలు రాయకూడదు

● ఇన్విజిలేటర్‌ ఇచ్చిన ఓఎంఆర్‌ షీట్‌పై విద్యార్థి పేరు, పరీక్షకు సంబంధించిన వివరాలు సక్రమంగా ఉన్నవీ, లేనివి నిర్థారించుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement