ప్రతిష్టాత్మకంగా వైవీయూ కాన్వకేషన్ల నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మకంగా వైవీయూ కాన్వకేషన్ల నిర్వహణ

Mar 11 2026 7:47 AM | Updated on Mar 11 2026 7:47 AM

ఈ నెల 13న గవర్నర్‌ రాక

వీసీ బెల్లంకొండ రాజశేఖర్‌

కడప ఎడ్యుకేషన్‌ : యోగివేమన విశ్వవిద్యాలయంలో నాలుగు కాన్వకేషన్లు ఒకేసారి ఈ నెల 13న ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు వైవీయూ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌ తెలిపారు. విశ్వవిద్యాలయం 11వ (2020–21), 12వ (2021–22), 13వ (2022–23), 14వ (2023–24) కాన్వకేషన్ల నిర్వహణకు వైవీయూ సిద్ధమైందన్నారు. కడపలోని వైవీయూ ఆధ్వర్యంలోని సి.పి బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాన్వకేషన్‌ను విశ్వవిద్యాలయంలో నిర్వహించడానికి అనువైన సమావేశ మందిరం లేదన్నారు. 20 ఏళ్ల విశ్వవిద్యాలయంలో వెయ్యి మంది కూర్చునే ఆడిటోరియం లేక, 300 మంది కూర్చునే సమావేశ మందిరాల్లోనే సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం నాలుగు కాన్వకేషన్లను ఒకేసారి నిర్వహించాల్సి రావడం వల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రుల సంఖ్య రెండు వేలకు చేరుతుందన్నారు. వారందరి సౌకర్యార్థం ఒక ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో కాన్వకేషన్‌ నిర్వహించాల్సి వచ్చిందన్నారు. విశ్వ విద్యాలయంలో కాన్వకేషన్‌ను నిర్వహించాలంటే తాత్కాలిక షెడ్ల నిర్మాణానికి రూ.25 లక్షల ఖర్చు అవుతుందని, దీనివల్ల విశ్వవిద్యాలయానికి ఆర్థికపరమైన వ్యయం పడుతుందని, దానిని తగ్గించేందుకు సమష్టిగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే వచ్చే ఏడాది విశ్వవిద్యాలయంలోనే కాన్వకేషన్‌ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో విశ్వవిద్యాలయానికి శాశ్వతమైన సమావేశ మందిరం నిర్మించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, దాతల సహకారాన్ని కూడా కోరనున్నామన్నారు.

70 మందికి పీహెచ్‌డీ పట్టాలు

ఈ కాన్వకేషన్‌లో 1,194 పీజీ పట్టభద్రులకు, డిగ్రీ, పీజీ కోర్సులలో ప్రతిభావంతులకు 176 బంగారు పతకాలు, 70 మంది పరిశోధకులకు పీహెచ్‌డీ పట్టాలు అందజేస్తున్నామన్నారు. నాలుగేళ్లకు కలిపి మరో ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వనున్నామన్నారు. ఆ ఇద్దరి పేర్లు రాష్ట్ర గవర్నర్‌ కార్యాలయం నుంచి ఆమోదం రాగానే వివరాలు వెల్లడిస్తామన్నారు. విద్యార్థుల పట్టాలు అందజేసే మహోన్నత కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ హాజరు కానున్నారని తెలిపారు. ఈ కాన్వకేషన్‌లో ఇన్‌ ఆప్సెన్షిసియా కింద 11,664 మంది డిగ్రీ విద్యార్థులు డిగ్రీలను అందుకోనున్నారని వివరించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ పుత్తా పద్మ, ప్రిన్సిపల్‌ టి.శ్రీనివాస్‌, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె.ఎస్‌.వి.కృష్ణారావు, బ్రౌన్‌ గ్రంథాలయ సంచాలకులు ఆచార్య పార్వతి, విశ్వవిద్యాలయ పబ్లిక్‌ రిలేషన్‌ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.సరిత, డాక్టర్‌ తుమ్మలూరు సురేష్‌ బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement