కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం మధ్యా హ్నం 12.20 గంటల నుంచి సాయంత్రం వరకూ తనిఖీలు నిర్వహించి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలోని సీపీ, ఏసీపీలు, టీపీఓ, టీపీబీఓలు, ఇతర సిబ్బంది, ప్రైవేటు వ్యక్తు లను తనిఖీ చేసి వారి వద్ద అనధికారికంగా ఉన్న సొ మ్మును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం ఏసీబీ సీఐ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా టౌన్‌ప్లానింగ్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం(బీపీఎస్)లో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బీపీఎస్ కింద భవన యజమానులకు నోటీసులిచ్చి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అందుకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేస్తున్నామని, వాటిని ఫిజికల్‌గా విచారణ చేసి త్వరలో వివరాలు వెల్లడిస్తామన్నారు. ఎంత మందికి నోటీసులు ఇచ్చారు అనే దానిపై కూడా విచారణ చేస్తున్నామని, ఎవరైనా బాధితులు ఉంటే తమకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
లక్షల్లో వసూళ్లు.. వెల్లువెత్తిన విమర్శలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కడప నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ విభాగంపై అనేక ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఆక్రమణల పేరిట భవన యజమానులకు నోటీసులిచ్చి, నగదు ముట్టజెప్పిన వారివి తప్ప మిగిలిన వాటిని కూల్చివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సాక్షితోపాటు అన్ని పత్రికల్లో కథనాలు వచ్చినా ఎవరూ లెక్క చేయలేదు. ఇటీవల ప్రభుత్వం బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం(బీపీఎస్)ను తీసుకురావడంతో అక్రమ వసూళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి బీపీఎస్ కింద రెగ్యులర్ చేస్తామని భవన యజమానులను బెదిరించి, భయపెట్టి లక్షల్లో వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు ప్లానింగ్ సెక్రటరీలు, టీపీబీఓలు కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. నగదు లావాదేవీల్లో తేడా రావడంతో నిన్న టౌన్‌ప్లానింగ్ కార్యాలయంలోనే ఓ ఏసీపీతో కొందరు బిల్డర్లు గొడవ పడినట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ మూలం ఇక్కడ జరుగుతున్న అవినీతేనని పలువురు కుండ బద్దలు కొడుతున్నారు.


