కడప అర్బన్ : కడప నగర శివార్లలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో ఈ నెల 7వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి (55) చికిత్స కోసం వచ్చాడు. కాసేపటికి మృతి చెందాడు. అతని ఆచూకీ కోసం తగిన ఆధారాలతో వస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని రిమ్స్ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
ఎర్రగుంట్ల : తన మిత్రుడు ఇచ్చిన పార్టీకి వెళ్లి తిరిగి బైక్‌లో వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని మంజులప్రసాద్ (21) అనే యువకుడు దుర్మరణం చెందిన సంఘటన చోటు చేసుకుంది. యర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగుంట్ల పట్టణంలోని షాదీఖానా వెనుక వీధిలో నివాసం ఉండే మంజుల వెంకటరమణ కుమారుడు మంజుల ప్రసాద్.. ముద్దనూరులో ఉండే తన మిత్రుడు ఇచ్చిన పార్టీకి సోమవారం రాత్రి వెళ్లాడు. అక్కడ విందు ముగించుకుని బైక్‌లో సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి బయలుదేరారు. ఎర్రగుంట్ల పట్టణ సమీపంలోని సుంకులమ్మ గుడి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొందా... లేక ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టాడా తెలియదు కానీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
రైలు కింద పడి వ్యక్తి మృతి
కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప–భాకరాపేట రైల్వేగేటు సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన శంకర్ (37) మృతి చెందాడు. రైలు కింద శంకర్ పడడంతో త్రీవంగా గాయపడగా, కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మంగళవారం మృతి చెందినట్లు రైల్వే ఎస్‌ఐ సునీల్ కుమార్ తెలిపారు. మృతుడిని ప్రొద్దుటూరు పట్టణంలోని వసంతపేటకు చెందిన నాగయ్య కుమారుడిగా పోలీసులు గుర్తించారు.


