– రూ.5 లక్షల నెక్లెస్ అప్పగింత
కడప అర్బన్ : ఓ ఆటో డ్రైవర్ నిజాయితీ చాటుకున్నారు. కడప నగరంలోని ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం సిద్దవటం మండలం వంతాటిపల్లి గ్రామానికి చెందిన భూషి విజయకుమారి తన భర్త వెంకటసుబ్బారెడ్డితో కలిసి ఒక బంగారు నెక్లెస్‌ను కడప టౌన్ బంగారు షాపులో రిపేరు చేయించుకున్నారు. బట్టలు షాపింగ్ చేసుకుని, సదరు బ్యాగును ఏపీ04యూఏ 0779 నెంబర్ గల ఆటోలో మరిచిపోయి విజయ హోటల్ దగ్గర దిగారు. సదరు ఆటో డ్రైవర్ పాత బస్టాండ్ దాటిన తర్వాత బ్యాగును చూసి, బ్యాగును నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి అప్పగించాడు. దీంతో కడప వన్‌టౌన్ సీఐ చిన్న పెద్దయ్య, సదరు బంగారు నెక్లెస్‌ను పోగొట్టుకున్న వ్యక్తుల గురించి ఆరా తీశారు. వారిని కనుగొని వారి ఆధార్ కార్డును తనిఖీ చేశారు. 35 గ్రాముల బంగారు నెక్లెస్‌ను వారికి అందజేయడం జరిగింది. ఆటో డ్రైవర్ నరసింహ రాజాకు సీఐ 500 రూపాయలు నగదును ప్రోత్సహక బహుమతిగా అందజేసి, అభినందించడం జరిగింది. బాధితులు ఒన్‌టౌన్ సీఐకి, ఆటో డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.


