ముద్దనూరు : స్థానిక ఆర్టీపీపీ రహదారిలో నివసిస్తున్న సగినాలబాషా (60) సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి సమాచారం మేరకు బాషా గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స పొందుతున్నా ఫలితం లేకపోవడంతో ఇంటి వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం బాషా మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు.మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చిన్నారిపై కుక్కల దాడి
ఎర్రగుంట్ల : ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై ఐదు కుక్కలు దాడి చేసిన సంఘటన సోమవారం రాత్రి ఎర్రగుంట్ల పట్టణంలోని క్రాంతినగర్ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఎర్రగుంట్లలోని క్రాంతినగర్ కాలనీలో నివాసం ఉండే నూర్‌బాషా, యాస్మీన్‌ల కుమారుడు జునేత్‌బాషా (3) ఇంటి ముందు బయట ఉండగా ఒక్కసారిగా ఐదు కుక్కలు వచ్చి దాడి చేశాయి. చిన్నారిని కరవడంతో తీవ్రగాయాలయ్యాయి.బాలుడిని కుక్కలు ఈడ్చుకుంటూ సుమారు 30 అడుగుల దాకా తీసుకెళ్లాయి. చిన్నారి కేకలు విన్న స్థానికులు వచ్చి అదిలించడంతో కుక్కలు పారిపోయాయి. వెంటనే బాలుడిని తల్లిదండ్రులు ప్రోద్దుటూరుకి తరలిచారు. క్రాంతినగర్ కాలనీ సమీపంలో ఉన్న మార్కెట్ యార్డు ప్రహరీ గోడ పగులకొట్టడంతో అక్కడ నుంచి కుక్కలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
జనసేన నేత మహేష్‌పై ఫిర్యాదు
మదనపల్లెటౌన్ : మదనపల్లె జనసేన నేత మహేష్‌పై మదనపల్లె ఆర్టీసీ కండక్టర్ సహా మరో వ్యక్తి ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రజా సమ స్యల పరష్కార వేదిక కార్యక్రమం డీఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి తో కలసి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి నిర్వహించారు. పట్టణానికి చెందిన జనసేన రాష్ట్ర ఏఐసీసీ అద్యక్షులు మైఫోర్స్ మహేష్ తన వద్ద రూ.18 లక్షలు డబ్బుతీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని స్థానిక ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న జి.రూప ఆరోపిస్తూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేసింది. అదే సమయంలో పట్టణానికి చెందిన మరో వ్యక్తి కూడా వచ్చి మహేష్ తనకు రూఫ్ వర్క్ చేయించుకుని సుమారు రూ. 8 లక్షలు డబ్బు ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఎస్పీకి ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు.


