గోపవరం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యథేచ్ఛగా భూకబ్జాలు జరుగుతూనే ఉన్నాయని, అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు వంత పాడుతున్నారని సీపీఐఎంఎల్ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్.చంద్రశేఖర్ పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తహసీల్దారు జీవన్‌చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. మండలంలోని గోపవరం రెవెన్యూ పొలం 168/1 సర్వేనెంబరులోని 49 సెంట్ల ప్రభుత్వ భూమిలో వెంటనే హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని, 130, 1633, 1633/1, 1633/2, 1634/1 సత్యా టౌన్‌షిప్‌లో ఆక్రమణకు గురైన రెండు లేఅవుట్‌లలో రెండు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉందని, వెంటనే ఆ భూములను పరిశీలించి హద్దులు ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని వారు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. నెల్లూరు – ముంబై జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూములు కోట్ల రూపాయలు పలుకుతుండటంతో ఆ భూములపై కబ్జాదారుల కన్ను పడిందని, ఇటీవల బదిలీపై వెళ్ళిన తహసీల్దారు సహకారంతోనే ఈ కబ్జాలు జరిగినట్లు ఆరోపించారు. కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురైన కథనాలు ఓ పత్రికలో వరుసగా రావడంతో వెలుగులోకి వచ్చిందని, వెంటనే ఆ భూములను పరిశీలించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన తహసీల్దారు 1633, 1634 సర్వేనెంబర్లలోని ప్రభుత్వ భూమిని గుర్తించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జకరయ్య, అనిల్‌కుమార్, రామరాజు, విజయరావు తదితరులు పాల్గొన్నారు.


