కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కడప సాయిపేటకు చెందిన దాసరి ఓబుళమ్మ(70) సోమవారం ఉదయం మృతి చెందారు. ఆమె మరణానంతరం కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆమె నేత్రాలను దానం చేయడం ద్వారా ఆదర్శంగా నిలిచారని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు,నేత్ర,రక్త, అవయవదాతల ప్రోత్సాహకులు పల్లవోలు రమణ, డి నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. అనారోగ్యంతో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తమకు తెలిపారని, వారికి నేత్రదానం గురించి తెలుపగా ఆమె కుమార్తె భాగ్యలక్ష్మి, కుమారుడు అంగీకరించారన్నారు. తర్వాత హైదరాబాద్ కు చెందిన ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ వారు కార్నియాలను సేకరించి ఇద్దరు అంధులకు అమర్చేందుకు పంపించారన్నారు. దీంతో ఇద్దరు అంధులకు చూపు లభించే అవకాశం కలిగిందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ మరణానంతరం కూడా మన నేత్రాల ద్వారా ఇతరుల జీవితాల్లో వెలుగు నింపవచ్చని తెలిపారు. నేత్రదానం పట్ల అవగాహన పెంపొందించుకుని, మరణానంతరం నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని వ పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య దాసరి ఓబులమ్మ మృతదేహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ నాగ సుబ్బారెడ్డి, ఎన్ వెంకట శివ, కేసి బాదులా,్ల జి వేణుగోపాల్, ఎన్ విజయలక్ష్మి, పి చంద్రశేఖర్, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.


