మైదుకూరు : మండలంలోని వనిపెంట వద్ద సోమవారం సెంట్రింగ్ పనులు చేస్తూ విద్యుదాఘాతంతో గారెల్ల విష్ణు (21) అనే యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని గంజికుంట ఎస్సీ కాలనీకి చెందిన విష్ణు కొద్ది రోజులుగా వనిపెంట వద్ద శ్మశాన వాటికలో గదుల నిర్మాణ పనులకు వెళుతున్నాడు. సోమవారం కాశి అనే మరో యువకుడితో కలిసి గది పైకప్పు కోసం వేసిన సెంట్రింగ్ రేకులను తొలగిస్తుండగా నిచ్చెన జారి పక్కనే ఉన్న విద్యుత్ వైర్లపై విష్ణు పడ్డాడు. అతన్ని వెంటనే మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఖాజీపేట మండలం సుంకేసుల గ్రామానికి చెందిన ఓబులేసు, లక్ష్మీనరసమ్మ దంపతులకు వంశీ, విష్ణు ఇద్దరు కుమారులు. వారు చిన్నప్పటి నుంచి గంజికుంటలోని అమ్మమ్మ వద్ద ఉంటూ బేల్దారి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. విష్ణు మృతి గురించి తెలియగానే సుంకేసుల నుంచి తల్లిదండ్రులు, గంజికుంట నుంచి బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. అర్బన్ ఎస్‌ఐ కత్తి వెంకటరమణ మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


