పింఛన్ ఇవ్వాలని ఓ అవ్వ.. కబ్జాకు గురైన భూమికి కంచె తెంచాలని ఓ తాత రెండు చేతులెత్తి వేడుకుంటారు... ఆదుకోవాలని ఒకరు.. అన్యాయమైపోయామని మరొకరు గోడుగోడుమంటారు.. అధికారుల మనస్సు కరగడం లేదు.. పాలకులకా చిత్తశుద్ధి లేదు.. ఇంకేముంది అవ్వకు పింఛన్ రాదు.. కబ్జా చేసి భూమికేసిన కంచె తెగదు.. పాపం.. బాధితులేమో వారం వారం ఆశగా అక్కడికి వస్తూనే ఉంటారు.. కాళ్లకున్న చెప్పులరిగేలా తిరుగుతూనే ఉంటారు.. ఇదీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పనితీరు. ముఖ్యంగా భూ బాధితులు ఇచ్చే అర్జీలు కొండల్లా పెరిగి నింగినంటుతున్నా.. పరిష్కారమేమో ‘నేల’చూపులే చూస్తున్నాయ్.. ఉన్నతాధికారుల నోళ్లేమో పరిష్కారం వేగవంతం..నాణ్యవంతమంటూ కబుర్లు చెబుతూనే ఉన్నాయ్. ఎప్పట్లాగే ఈ సోమవారమూ భూ బాధితులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఆశగా మరోసారి అర్జీలు అందజేశారు.
కడప సెవెన్‌రోడ్స్ : భూ సమస్యలు గడువులోపు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన ప్రజా సమస్యలపరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా పీజీఆర్‌ఎస్‌లో భూ సమస్యలే అధికంగా వస్తున్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకించి రెవెన్యూ క్లినిక్‌లు ఏర్పాటు చేశామన్నారు. అర్జీదారులు మళ్లీమళ్లీ రాకుండా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.


