కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో ప్రారంభించిన స్మార్ట్ కిచెన్ దేశానికే ఆదర్శమని నీతి అయోగ్ ప్రాంతీయ సదస్సులో నీతి ఆయోగ్ ఉప కార్యదర్శి గౌరవ్ కత్యార్, సభ్యులు కొనియాడారు. సోమవారం విశాఖపట్నంలో ఏ1 గ్రాండ్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం (ఏడీపీ), ఆకాంక్షిత మండలాల కార్యక్రమం (ఏబీపీ)లో భాగంగా దక్షిణ ప్రాంత నీతి ఆయోగ్ ప్రాంతీయ సదస్సులో పాల్గొన్న కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వారి నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సమావేశంలో ‘స్మార్ట్ కిచెన్’కార్యక్రమాన్ని ఉత్తమ పద్ధతిగా ప్రదర్శించారు. దక్షిణ భారత రాష్ట్రాల నుంచి వచ్చిన ఆకాంక్షిత జిల్లాలు, మండలాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ.. ‘స్మార్ట్ కిచెన్’ కార్యక్రమం ద్వారా ఆహార తయారీ వ్యవస్థలో సామర్థ్యం,పరిశుభ్రత, పోషకాహార నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ నమూనాను ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో విజయవంతంగా అమలు చేశామ న్నారు. దీని ద్వారా ఆహారనిర్వహణ, పంపిణీ వ్యవస్థలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని తెలిపారు. ఈ సదస్సులో సభ్యులు మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లాలు, మండలాలు విజయవంతమైన పాలన విధానాలు,వినూత్న పరిష్కారాలను పంచుకుని సామాజిక–ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఒక వేదికగా నిలిచిందన్నారు. వైఎస్‌ఆర్ కడప జిల్లా యంత్రాంగం అమలు చేసిన ‘స్మార్ట్ కిచెన్’కార్యక్రమాన్ని ఇతర జిల్లాలు,రాష్ట్రాల్లో కూడా అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నామని వారు పేర్కొన్నారు.


