– వ్యక్తి మృతి
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని కదిరివారిపల్లె గ్రామానికి వెళ్లే దారి మధ్యలో ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని విద్యుత్ తీగలు తగలి రామయ్య(37) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌ఐ నాగమురళి శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు... నిడుజవ్వి గ్రామానికి చెందిన చౌడయ్య నాపరాయి గని నుంచి రామయ్య అనే వ్యక్తి కూలీలను ట్రాక్టర్లలో ఎక్కించుకొని నిడుజవ్వి నుంచి కదిరివారిపల్లెకు బయలు దేరారు. దారి మధ్యలో అదుపు తప్పి ట్రాక్టర్ పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. వెంటనే ట్రాలీలో ఉన్న కూలీలను కిందికి దించేశాడు. తర్వాత తాను కిందకు దిగుతుండుగా తీగలు తగలి రామయ్య మృతి చెందాడు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు సంతానం కలరు. మృతుడి అన్న చౌడయ్య ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డాక్టరు మూలె సుధీర్‌రెడ్డి మృతుడి కుటుంబ సభ్యలను పరామర్శించారు.
ఆర్టీపీపీలో భారీగా పెరిగిన బొగ్గు నిల్వలు
ఎర్రగుంట్ల : డాక్టరు ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో బొగ్గు నిల్వలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఆర్టీపీపీలో 4 లక్షల మెట్రిక్ టన్నులకు పైగానే నిల్వలు ఉన్నాయని ఆర్టీపీపీ సీఈ వాసుదేవరావు శనివారం తెలిపారు. ప్రస్తుతం ప్రతి రోజు బొగ్గు వ్యాగున్లు ఆర్టీపీపీకి వస్తున్నాయన్నారు. 2వ యూనిట్ తప్ప మిగిలిన 1,3,4,5,6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరగుతుందన్నారు. 2వ యూనిట్ ఓవర్‌రాలింగ్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆర్టీపీపీలో 1650 మెగావాట్లకు గాను ప్రస్తుతం 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉందన్నారు. బొగ్గు, నీరు సంవృద్ధిగా ఉన్నాయని ఏపీజెన్‌కో యాజమాన్యం సూచనల మేరకు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
సిద్దవటం : మాధవరం–1 గ్రామంలో 12వ నంబర్ రోడ్డులో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. స్థానిక చేనేత కార్మికుడు శ్రీరాందాసు చిన్న వెంకటసుబ్బయ్య ఇంట్లో చొరబడిన దుండగులు నగదు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. బాధితుడు చిన్న వెంకటసుబ్బయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి అనంతపురం వెళ్లారు. శనివారం వారు తిరిగి వచ్చేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించి షాక్‌కు గురయ్యారు. బయటి గేటు తాళం వేసినది వేసినట్లు ఉన్నప్పటికీ.. రక్షణ గోడ దూకి లోపలికి ప్రవేశించిన దొంగలు మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టారు. బీరువాలో దాచుకున్న రూ.15 వేల నగదు, 150 గ్రాముల వెండి వడ్డాణం అపహరించారని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ హారిక వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.
ఏపీలోనే బెస్ట్ స్కూల్ అవార్డుకు ఎంపిక
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆంధ్రప్రదేశ్‌లోనే బెస్ట్ స్కూల్ అవార్డుకు ఎంపికై ందని ప్రధానోపాధ్యాయుడు గురుభాస్కర్‌రెడ్డి తెలిపారు. భారతదేశంలోనే నంబర్‌వన్ స్కూల్ సర్చ్ ఫ్లాట్‌ఫాంగా పని చేస్తున్న ఎడ్యుకనెక్ట్ ఇన్ సంస్థ ఇండియాలోని 15 లక్షల పాఠశాలలు, 2 లక్షల మంది తల్లిదండ్రులను ఎంపిక చేసుకొని ఒక సర్వే నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కడప జిల్లాలోని 4023 పాఠశాలలకు గాను ఎర్రగుంట్ల పట్టణంలో ఉన్న పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల బెస్ట్ స్కూల్ అవార్డుకు ఎంపికై ందని తెలిపారు.


