పోలీస్ సంక్షేమానికి పెద్దపీట
కడప అర్బన్ : జిల్లాలో పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తామని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హామీ ఇచ్చారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీస్ డైరీ– 2026ను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బందికి ఉపయోగపడే ప్రభుత్వ ఉత్తర్వులు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ శాఖాపరమైన సంక్షేమ పథకాలపై సమగ్ర సమాచారాన్ని ఈ డైరీ ద్వారా సిబ్బందికి అందజేయడం పై పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, జమ్మలమడుగు డీఎస్పీ కె.వెంకటేశ్వర రావు, ఆర్.ఐ సోమశేఖర్ నాయక్, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
పీఎఫ్ స్లిప్పులను ఆన్‌లైన్ చేయాలి
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధ్యాయుల ప్రావిడెంట్ ఫండ్ స్లిప్పులను వెంటనే ఆన్‌లైన్ చేయాలని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పాలెం మహేష్‌బాబు కోరారు. ఈ విషయమై మంగళవారం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఓబుళమ్మను జెడ్పీ కార్యాలయంలో కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్, మండల పరిషత్ పరిధిలోని ఉపాధ్యాయులు ప్రతి నెలా తమ వేతనం నుండి మినహాయించి జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్‌కు కాంట్రిబ్యూషన్‌ను జమ చేయడం జరుగుతున్నదన్నారు. అయితే జిల్లాలో జిల్లా పరిషత్ వారు ప్రావిడెంట్ ఫండ్‌ను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ చేయకపోవడంవల్ల తమ మినహాయింపులు సక్రమంగా జమ అవుతున్నాయో లేదో తెలు సుకోలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు. వెంటనే సమస్యపరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వల్లూరు : వల్లూరు మండల పరిధిలోని పైడికాలువ గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలెం రాముడు (45) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు పైడికాలువ ఎస్సీ కాలనీకి చెందిన రాముడు గ్రామానికి చెందిన మరి కొందరితో కలిసి కడప పట్టణ శివార్లలోని ఓ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో పని చేయడానికి ఆటోలో బయలుదేరాడు. పైడికాలువ వంక సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో ఆటోలోని రాముడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలోని మరో వ్యక్తి దొరబాబు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. మృతునికి భార్య, వృద్ధురాలైన తల్లి వున్నారు.
రెండు బైకులు ఢీ
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోగల ఊటుకూరు రింగురోడ్డు సమీపంలో మంగళవారం ఉదయం రెండు బైకులు ఢీకొనడంతో ఇంజనీరింగ్ విద్యార్థి నంబూరి గోవర్ధన్ (19) మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. చింతకొమ్మదిన్నె పోలీసుల కథనం మేరకు.. అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఈసీఈ చదివే నంబూరి గోవర్ధన్, అదే కళాశాలలో చదివే తన స్నేహితుడు నితీశ్వర్ రెడ్డి అనే విద్యార్థితో కలిసి ట్రయంఫ్ బైక్ పై కడప వైపు నుంచి అన్నమాచార్య కళాశాలకు బయలుదేరారు. ఊటుకూరు వైపునకు స్థానిక చైతన్య పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులతో వెళ్తుండిన కేర్ టేకర్ రాజశేఖర్ అనే వ్యక్తి తన హోండా బైక్ ను రోడ్డు అవతలివైపు రోడ్డులోకి గమనించకుండా మలుపు తిప్పడంతో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గోవర్ధన్ తలకు తీవ్రగాయాలయ్యాయి. అతను సంఘటన స్థలంలోనే స్పృహ కోల్పోయాడు. వెనువెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికి చికిత్స పొందుతూ మృతి చెందాడు. నితీశ్వర్ రెడ్డి, రాజశేఖర్ లతోపాటు పాఠశాల విద్యార్థులు మునిలింగేశ్వర్, పండరినాథ్‌లకు గాయాలు కాగా, చికిత్స పొందుతున్నట్లు సమాచారం. బైకు నడుపుతుండిన గోవర్ధన్ తలకు హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు దక్కేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీస్ సంక్షేమానికి పెద్దపీట
పోలీస్ సంక్షేమానికి పెద్దపీట
పోలీస్ సంక్షేమానికి పెద్దపీట


