గంజాయి బ్యాచ్‌కు నడిరోడ్డుపై కౌన్సెలింగ్
వేంపల్లె : గంజాయి బ్యాచ్‌కు పోలీసులు నడిరోడ్డుపై నడిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. గంజాయి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ హెచ్చరించారు. మంగళవారం వేంపల్లెకు చెందిన బాబా ఫకృద్దీన్, ఆదిల్, ఖానాల గణేష్‌రెడ్డి అనే ముగ్గురు గంజాయి బ్యాచ్‌కు డీఎస్పీ మురళి నాయక్ ఆధ్వర్యంలో సీఐ నరసింహులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే వారిని వేంపల్లె పట్టణంలో నడిపిస్తూ ఊరేగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు గంజాయి విక్రయాలపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. గంజాయి విక్రయాలకు పాల్పడినా, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ఊరుకునేదిలేదని హెచ్చరించారు. రాయచోటి నుంచి వేంపల్లె పట్టణానికి గంజాయి తీసుకుని వచ్చి విక్రయిస్తున్న బాబా ఫకృద్ధీన్, షేక్ ఆదిల్, ఖానాల గణేష్ రెడ్డి అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 1.05 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయితో పాటు ఇతర నిషేధిత మత్తు పదార్థాల విక్రయ లేదా వినియోగ సమాచారాన్ని ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు తెలియజేయాలన్నారు.


