గండి కొవ్వూరు సర్పంచ్ మృతి
చక్రాయపేట : మండలంలోని గండి కొవ్వూరు గ్రామ సర్పంచ్ మోపూరు కిరణ్‌కుమార్ రెడ్డి (33)మంగళవారం మృతి చెందాడు. మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో పోలీసులు అనుమానాస్పదం కింద కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులుతో పాటు వేంపల్లె సీఐ నరసింహులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు కిరణ్ కుమార్ రెడ్డి వేంపల్లెలో నివాసం ఉంటున్నాడు. ఆయన సతీమణి మాధవి కాన్పు నిమిత్తం గండికొవ్వూరు లోని అమ్మ గారి ఇంటికి వెళ్లి రెండు నెలల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కిరణ్ సోమ వారం రాత్రి వేంపల్లెలో ఉండి పోయాడు ఉదయం మృతుడి భార్య మాధవితో ఫోన్‌లో కూడా మాట్లాడి ఇంటికి గండి కొవ్వూరుకు వస్తున్నట్లు చెప్పాడు. అనంతరం తన డ్రైవర్‌కు ఫోన్ చేసి జ్వరంగా ఉండి ఊరికి వస్తున్నానని చెప్పాడు. అనంతరం ఎవరు ఫోన్ చేసినా లిప్ట్ చేయలేదు. దీంతో మృతుడి భార్య భయంతో తండ్రిని వేంపల్లెకు పంపింది. ఆయన వచ్చి చూసేసరికి ఇంటి ముంగిట చెప్పులు ఉండటంతో తలుపు తెరచి లోనికి వెళ్లగా బాత్‌రూంలో పడి ఉన్నడు. వెంటనే ఆయన మరో వ్యక్తి వేంపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే సరికి మృతి చెందాడు. అయితే మృతుడి చేతికి గాయాలు ఉండటంతో అతడి మామ సుబ్బిరెడ్డిగారి వీరనాగిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసి పోస్టు మార్టం చేయిస్తున్నట్లు సీఐ నరసింహులు తెలిపారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం : ఎంపీ
గండి కొవ్వూరు గ్రామ సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి మృత దేహానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాళులు అర్పించారు. కిరణ్ కుమార్ రెడ్డి చనిపోయిన విషయం తెలియగానే ఆయన వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. జరిగిన సంఘటనపై ఆరాతీశారు. అనంతరం ఆయన మృతుడి సాదరుడు అశోక్ కుమార్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు. కిరణ్ కుటుంబాన్ని అన్ని విదాలా ఆదుకుంటామని, చెప్పారు. ఆయన వెంట చక్రాయపేట వేంపల్లె మండల కన్వీనర్లు బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డి,చంద్ర ఓబుళరెడ్డి, జెడ్పీటీసీలు శివప్రసాద్‌రెడ్డి, రవికుమార్ రెడ్డి, ఎంపీపీ మాధవీ బాలకృష్ణ, సర్పంచులు శ్రీధర్ రెడ్డి, వెంకటసుబ్బయ్య, నరసింహులు, మల్లికార్జునరెడ్డి,ఆ ర్ శీను, బీజేపీ నాయకుడు రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.
అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు


