కూటమి ప్రభుత్వాన్ని బోగి మంటల్లో వేసి కాల్చండి
● ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు
ఏమయ్యాయి
● అమాంతంగా పెంచిన
నిత్యావసర వస్తువుల ధరలు
● మద్యం ధరలనూ పెంచేశారు
● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : గడిచిన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను మరచి నిత్యావసర వస్తువుల ధరలు, మద్యం ధరలను పెంచిన కూటమి ప్రభుత్వాన్ని బోగి మంటల్లో వేసి కాల్చాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఘాటుగా విమర్శించారు. ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో సంక్రాంతి పండగ పూట కూడా పేద ప్రజలు పచ్చడి మెతుకులు తినాల్సిన దయనీయ పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 కిలోల బియ్యం బస్తా రూ.5వేలు ఉండగా ఇప్పుడు రూ.6వేలు పెరిగిందని, కిలో చింత పండు రూ.90 నుంచి రూ.150కి, కొబ్బెర రూ.220 నుంచి 380కి, కందిపప్పు రూ.100 నుంచి రూ.130కి, ఉద్దిబేడలు రూ.100 నుంచి రూ.120కి, నూనె రూ.100 నుంచి రూ.165కు, మిరప రూ.260 నుంచి రూ.350కి పెరిగాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో అక్కచెల్లెమ్మలు సంక్రాంతి పండుగను కూడా చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
పెంచిన మద్యం ధరలు:
గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు మద్యం ధరలను తగ్గిస్తామని, నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు. పేదలు ఎక్కువగా తాగే మద్యం క్వార్టర్ రూ.120 నుంచి రూ.140కి పెంచారని, మార్‌ప్లస్ క్వార్టర్ రూ.290 నుంచి రూ.310కి, నెపోలియన్ బ్రాందీ రూ.230 నుంచి రూ.250కి పెంచారన్నారు. ఈ ప్రకారం రోజుకు రెండు క్వార్టర్లు మద్యం సేవిస్తే రూ.40 అదనపు భారం కలిపి నెలకు రూ.1200 పెరిగినట్లు అవుతుందన్నారు. కూలినాలి పనులు చేసుకునే పేదలు మద్యానికే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎక్కడైనా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని ఆలోచిస్తుందని, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వ్యాపారులకు మేలు చేసి తద్వారా రూ.కోట్లు లబ్ధి పొందిందన్నారు. చంద్రబాబు ఏమో విజనరీ అంటూ, లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యంగమంటూ, పవన్ కళ్యాణ్ సనాతనీ అంటూ చెప్పడమే తప్ప ఆచరణలో ఏమీ లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో రూ.3లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి పాల్గొన్నారు.


