రాజంపేట.. తగ్గిన అటవీ వాటా
రాజంపేట: అంతర్జాతీయంగా ఖ్యాతిని ఆర్జించిన రాయలసీమలోనే ఎర్రచందనం సంపద నిలయమమైన రాజంపేట ఫారెస్టు కోటకు బీటలు వారాయి. ఆరు దశాబ్దాల రాజంపేట అటవీ డివిజన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారనున్నది. రాయలసీమలో ఎర్రచందనం డివిజన్‌గా ప్రసిద్ధి చెందిన డివిజన్‌కు ఇప్పుడు తిరుపతి, అన్నమయ్య జిల్లాల ప్రభావం పడింది. ఫలితంగా డివిజన్ వ్యాప్తంగా విస్తరించిన శేషాచలం అటవీ విస్తీర్ణంలో రాజంపేట తన వాటా పూర్తిగా తగ్గిపోయిందని అటవీ వర్గాలే ధ్రువీకరిస్తున్నాయి. రాజంపేట అటవీ డివిజన్ విస్తీర్ణం పంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుపతి, అన్నమయ్యకు పోగా మిగిలిన అటవీ విస్తీర్ణం కలిగిన రాజంపేట డివిజన్ వైఎస్సార్ కడపలోకి విలీనం కానున్నది. చరిత్ర కలిగిన రాజంపేట అటవీ డివిజన్ నిర్వహణ, హద్దుల వ్యవహారంపై అటవీశాఖ ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
కడప డివిజన్‌లోకి విలీనమేనా?
రాజంపేట కేంద్రంగా అన్నమయ్య అటవీ పాలన కొనసాగిన సంగతి విదితమే. ఇప్పుడు డివిజన్‌పై కొత్తగా ఏర్పడిన మదనపల్లె జిల్లా ప్రభావం పడింది. ఇటు తిరుపతి జిల్లా ప్రభావాన్ని ఎదుర్కొంది. ఫలితంగా అటవీ విస్తీర్ణంతోపాటు జిల్లా అటవీ శాఖ కార్యాలయం కూడా మదనపల్లెకు తరలింపునకు అటవీ శాఖ సమాయత్తం కావాల్సి వస్తోంది. ఇప్పుడు రాజంపేట వైఎస్సార్ కడప జిల్లాలోకి విలీనం అయిన క్రమంలో కడప జిల్లా అటవీ శాఖ పరిధిలోకి వెళుతుంది. ఇక్కడ ఉన్న అన్నమయ్య జిల్లా అటవీ కేంద్ర కార్యాలయం బదిలీ కాక తప్పదు.
సబ్ డీఎఫ్‌ఓ పాలనలోకి రాజంపేట
ఐఎఫ్‌ఎస్ పాలన జరిగిన రాజంపేట ఇప్పుడు సబ్‌డీఎఫ్‌ఓ కంట్రోల్‌కి చేరనున్నది. ఒకప్పుడు రైల్వేకోడూరుకు సబ్‌డీఎఫ్‌ఓ హోదా అధికారి ఉండేవారు. రాజంపేటకు ఐఎఫ్‌ఎస్ అధికారి పాలన కొనసాగేది. ప్రస్తుతం ఆ పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు కడప అటవీశాఖ ఆధీనంలోకి మిగిలిన రాజంపేట అటవీ విస్తీర్ణం చేరనున్నది.
రాజంపేట ఎర్రబంగారంకే డిమాండ్
అరుదైన జంతుజాలంకు నెలవు.. కేంద్ర ప్రభుత్వంచే జీవవైవిధ్య అటవీ ప్రాంతంగా గుర్తింపు పొందిన శేషాచలం.. ఎర్రచందనం చెట్లతో విశిష్ట ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానంగా శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనం ఎక్కువ చేవ ఉండటంతో దానికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉంది. ఇందులో రాజంపేట ఎర్రచందనానికి మరి డిమాండ్. అందువల్లనే ఎర్రచందనం డిపో కేంద్రాన్ని గతంలో ఏర్పాటు చేశారు. ఎన్‌టీఆర్ బర్తరఫ్ సమయంలో జరిగిన ఆందోళనలో భాగంగా ఈ డిపో అగ్నిప్రమాదానికి గురైన సంగతి విదితమే. అన్నమయ్య జిల్లాలో 2.8 మిలయన్ల హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి.
ఆరు దశాబ్దాల డివిజన్ ప్రశ్నార్థకం
శేషాచలంలో తగ్గిన విస్తీర్ణం
మదనపల్లె దిశగా అన్నమయ్య డీఎఫ్‌ఓ


