గండికోట ఉత్సవాలకు సన్నద్ధం కావాలి
జమ్మలమడుగు: ప్రముఖ పర్యాటక, చారిత్రాత్మక గండికోట ఉత్సవాల నిర్వహణకు అధికారులందరూ సన్నద్ధం కావాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. ఈనెల 11 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం గండికోటను సందర్శించారు. ఈసందర్భంగా ఉత్సవాల కార్యక్రమాలు, ఉత్సవ వేదికప్రాంగణం, పార్కింగ్ తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండికోట ఉత్సవాలు దేశం నలుమూలల చాటేవిధంగా వైభవోపేతంగా నిర్వహించాలన్నారు. జిల్లా చరిత్రను ప్రపంచానికి తెలియజేసేవిధంగా ఉత్సవాలు ఉండబోతున్నాయని వివరించారు. ఉత్సవాల కోసం జరుగుతున్న పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. గండికోట ప్రాంతంలో సాస్కి పథకం కింద 79 కోట్లతో అభివృద్ధి చేసి అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేవిధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని పేర్కొన్నారు. పర్యాటకులకు సంతృప్తి కరమైన అనుభూతిని అందించేందుకు పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టూరిస్టులకు ఎక్స్‌పీరియన్స్ సెంటర్, 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అమినీటిస్, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. గండికోట రహదారికి ఇరువైపుల పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం చేపట్టేవిధంగా పనులు చేస్తున్నామని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి, టూరిజం జిల్లా అధికారి సురేష్‌కుమార్, ఆర్డీఓ సాయిశ్రీ, తహసీల్దార్‌శ్రీనివాసుల రెడ్డి డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి


