పేదల పక్షాన పోరాటమే వైఎస్సార్‌సీపీ లక్ష్యం
ప్రొద్దుటూరు : పేదల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేసి వారికి అండగా ఉంటుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. స్థానిక కొర్రపాడు రోడ్డులోని ఎర్రన్నకొట్టాలు వాసులతో ఆదివారం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడారు. కొర్రపాడు రోడ్డు విస్తరణకు సంబంధించి అధికారులు పరిహారం ఇవ్వకుండానే కూల్చేస్తామని చెబుతున్నట్లు బాధితులు రాచమల్లుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కొప్పరపు సుబ్బారావు కుటుంబీకులతో ఎర్రన్నకొట్టాలు వాసులు స్థలాలు కొనుగోలు చేశారన్నారు. అయితే ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్‌తోపాటు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వారిది పట్టా స్థలం కాదని, డీకేటీ అని చెబుతున్నట్లు ప్రజలు వాపోతున్నారన్నారు. పరిహారం చెల్లించకుండా గోడలోని ఏ ఒక్కరాయిని తొలగించినా వైఎస్సార్‌సీపీ వారికి అండగా పోరాటం చేస్తుందన్నారు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ఎర్రన్నకొట్టాలుకు ముప్పు పొంచి ఉంటోందన్నారు. మైదుకూరు రోడ్డులో సర్పంచ్ శివచంద్రారెడ్డి కాంప్లెక్స్ స్థలం ప్రభుత్వానిది అని చెప్పినా పట్టించుకోరు కానీ పేదలు తమది పట్టా స్థలం అని చెప్పినా ఎందుకు తొలగించాలనుకుంటున్నారో తమకు అర్థం కావడం లేదన్నారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ ఎర్రన్నకొట్టాలు వాసులతో సమావేశం ఏర్పాటు చేసి రోడ్డు విస్తరణపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, రాజుపాళెం మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఎస్‌ఏ నారాయణరెడ్డి, గుద్దేటి రాజారాంరెడ్డి, లక్ష్మిరెడ్డి పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి


