సకల గుణాభిరామా.. శ్రీరామా
సకల సద్గుణాలకు మారురూపుగా, మానవాళికి ఆదర్శంగా అపురూపమైన బంధాలకు ఆలవాలంగా నిలిచిన శ్రీరాముడు జన్మించిన శుభదినం. ఆయన సీతారాముడయ్యే శుభలగ్నం వెరసి ఆదివారం శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు జిల్లా అంతటా రామాలయాలు పండుగ శోభతో కళకళలాడుతున్నాయి.
కడప కల్చరల్ : సీతా, రాముల కల్యాణ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా ఆయా ఆలయాల్లో నిర్వాహకులు చురుగ్గా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర అధికారిక ఆలయం కోదండ రామాలయం జిల్లా ఒంటిమిట్టలో ఉండడంతో జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. శ్రీరామ నవమి పండగను జిల్లాలో ఇటీవల భారీగా నిర్మించిన రామాలయాలలో ఘనంగా నిర్వహిస్తారు. శనివారం సాయంత్రానికే ఆలయాలు, వీధుల్లో చలువ పందిళ్లు, షామియానాలు వెలిశాయి. ఇక పండగ రోజున ప్రజలు ఒకే చోట చేరి స్వామి, అమ్మవారి పెళ్లి తిలకించి విందు భోజనాలు చేస్తారు. ఔత్సాహిక భక్తులు, నిర్వాహకులు అందించే పానకం, వడపప్పు, తీర్థ ప్రసాదాలు శ్రీరామ నవమి ప్రత్యేకతను చూపుతాయి. ఓ శుభ కార్యానికి బంధుమిత్రులు, ఇరుగుపొరుగులతో కలిసి రెండు గంటలపాటు ఒకే చోట కలిసి ఉండే అపురూపమైన అవకాశం శ్రీరామ నవమి ఇస్తోంది. జిల్లాలో చిన్న, పెద్ద రామాలయాలు దాదాపు 4 వేలకు పైగా ఉన్నాయి. వాటితోపాటు పెద్ద వైష్ణవాలయాలు కూడా శ్రీరామనవమి పండుగకు సిద్ధమయ్యాయి. ఉదయం పది గంటల తర్వాత ఆయా ఆలయాల్లో పురోహితుల నిర్ణయాన్ని బట్టి సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక వేదికలను సిద్ధం చేశారు. భక్త బృందాలు ఆలయాలకు పండగ శోభ కల్పించడంలోభాగంగా మామిడి తోరణాలు, అరటి బోదలతో అలంకరించడం, కల్యాణానికి హాజరయ్యే భక్తులందరికీ ప్రసాదంగా పంచి పెట్టేందుకు పానకం, వడపప్పు తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. పలు పెద్ద ఆలయాలలో కల్యాణ అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులందరికీ విందు ఏర్పాటు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొన్ని ఆలయాల్లో ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు ప్రతిరోజు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం లోపుగా కల్యాణం, సాయంత్రం 6 గంటల నుంచి నగరోత్సవాలు నిర్వహించేందుకు రథాలు, పల్లకీలు సిద్ధం చేసుకుంటున్నారు.
నేడు జిల్లా అంతటా కల్యాణానికి ఏర్పాట్లు


