కడప కోటిరెడ్డిసర్కిల్ /బనశంకరి : కేఎస్‌ఆర్‌టీసీ బస్ డ్రైవరు రాంగ్ రూట్లో వచ్చి ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్ డ్రైవరుపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులోని ఉప్పారపేటె పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కెంపేగౌడ బస్టాండు టెర్మినల్ –3లో గురువారం రాత్రి 10.30 సమయంలో మైసూరు రోడ్డు డిపో–6 కు చెందిన కేఎస్‌ఆర్‌టీసీ బస్ డ్రైవరు హనుమంతు చలవాది బస్‌ను డిపోలోకి రాంగ్‌రూట్లో తీసుకెళ్లాడు. డిపోలో పార్కింగ్ స్థలంలో ఏపీఎస్‌ఆర్‌టీసీ ప్రొద్దుటూరు డిపో బస్ ఉండటంతో పక్కకు తీయమని తెలిపారు. ఆ సమయంలో కేఎస్‌ఆర్‌టీసీ డ్రైవరు హనుమంతు చలవాది, ప్రొద్దుటూరు డిపో డ్రైవరు నరాల రవిశంకర్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన కేఎస్‌ఆర్‌టీసీ డ్రైవరు హనుమంతు చలవాది, నరాల రవిశంకర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని తక్షణం మల్లిగె ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఉప్పారపేటె పోలీస్ స్టేషన్‌లో డ్రైవరు నరాల రవిశంకర్‌రెడ్డి కేఎస్‌ఆర్‌టీసీ డ్రైవరు హనుమంతు చలవాదిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేఎస్‌ఆర్‌టీసీ ఉన్నతాధికారులు కేఎస్‌ఆర్‌టీసీ డ్రైవరు కమ్ కండక్టర్ హనుమంతు చలవాదిని సస్పెండ్ చేశారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే శుక్రవారం ఆర్‌టీసీ రీజనల్ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పూల నాగరాజు దాడికి గురైన డ్రైవరు నరాల రవిశంకర్‌రెడ్డిని ఆసుపత్రిలో పరామర్శించారు. ఆస్పత్రి వైద్యం ఖర్చులను ఏపీఎస్‌ఆర్‌టీసీ భరిస్తుందని హామీ ఇచ్చారు.
బాధిత డ్రైవర్‌ను అన్ని విధాల ఆదుకుంటాం
బెంగుళూరు బస్టాండు పాయింట్‌లో జరిగిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రొద్దుటూరు డిపో డ్రైవర్ ఎన్‌ఆర్‌ఎస్ రెడ్డిని అన్ని విధాల ఆదుకుంటామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని మీడియాకు వివరించారు. బెంగుళూరులో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్‌ను అలెర్ట్ చేసి బాధిత డ్రైవర్‌కు అండగా నిలబడాలని సూచించామన్నారు. ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు మాట్లాడుతూ బెంగుళూరుకు వెళ్లి సమగ్రంగా విషయాలు తెలుసుకున్నారన్నారు. బాధిత డ్రైవర్‌కు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కడప ఈడీకి సూచించినట్లు వివరించారు. అంతేకాకుండా బాధిత డ్రైవర్ వైద్యానికి సంబంధించి మొత్తం ఖర్చును ఆర్టీసీ సంస్థ భరిస్తుందని ఆర్‌ఎం తెలియజేశారు. కర్ణాటక డ్రైవర్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తామని తెలిపారు. రాష్ట్రాలు వేరైరా అందరూ సోదరభావంతో మెలగాలని ఆయన డ్రైవర్లకు పిలుపునిచ్చారు.