కడప కార్పొరేషన్ : రాయలసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి డిమాడ్ చేశారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాయలసీమకు అన్యాయమే జరుగుతుందని, అదేం ఖర్మో తెలియదు గానీ వర్షాలు అసలే పడవన్నారు. ఆయన పదిహేనేళ్లు అధికారంలో ఉంటే 14 ఏళ్లు కరువేనని, ఒక ఏడాది వరదలు వచ్చాయన్నారు. ఈ పదిహేనేళ్లలో రైతులు తమ పంటలు నష్టపోవడం మినహా బాగుపడింది లేదన్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014–19లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి, రంగారెడ్డి పాలమూరు ఎత్తపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకాల పేర్లతో అక్రమ నీటి ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. వీటికి నీటి కేటాయింపులు లేకపోయినా ఇది అక్రమమని ఆనాడు ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రశ్నించలేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 885 అడుగులని, దానిపైన నీళ్లుంటే తప్పా రాయలసీమకు నీళ్లు రావన్నారు. 800 అడుగులుంటే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. ఫలితంగా అవసరమున్నా.. లేకపోయినా తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీరు కిందికిపోయేలా చేస్తున్నారన్నారు. కనిష్ట పరిమితి నిల్వ చేయకపోవడం వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు నీరు రావడం లేదన్నారు. రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు ఆనాడు తాకట్టు పెట్టడం వల్ల నేడు సాగునీరు కాదుకదా తాగునీటికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో వరదలు వస్తే తప్పా శ్రీశైలం నిండటం లేదన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నా చంద్రబాబు నోరు మెదప లేదన్నారు. సీమలోని తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్, చైన్నెకి తాగునీరు అందించాలంటే సుమారు 101 టీఎంసీలు కావాల్సి ఉందన్నారు. అందుకే దివంగత వైఎస్సార్ ఎక్కువ నీటిని తీసుకుపోయేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11వేల క్యూసెక్కులకు పెంచారని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సామర్థ్యాన్ని 33వేల క్యూసెక్కులకు పెంచారన్నారు. చంద్రబాబు అఽధికారంలో ఉండగా వైఎస్సార్ జలయజ్ఞంలో చేపట్టిన ఏ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేదన్నారు. అందుకే ఆయన రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారన్నారు. రాయలసీమ రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2023లో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని, దీనిపై తెలంగాణలోని టీడీపీ వారితో ఎస్‌జీటీకి ఫిర్యాదు చేయించారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జున సాగర్‌ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహణ చేయాల్సి ఉన్నా తెలంగాణ లెక్కచేయడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం పార్టీలకతీతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యా నందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు బీహెచ్ ఇలి యాస్, శ్రీరంజన్‌రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి. రవీంద్రనాథ్‌రెడ్డి