భవానీశంకర్‌ను చంపిన తరువాతే ఇంటిలో అడుగుపెడతా..

- - Sakshi

కడప అర్బన్‌ : కడప నగరం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి ఎల్‌ఐసీ డివిజనల్‌ కార్యాలయం సముదాయంలోని ఓ గదిలో ఆదివారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎల్‌ఐసీ వారి ఈడీఎంఎస్‌ డిజిటలైజేషన్‌ విభాగం ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి.. తన వద్ద పార్ట్‌ టైంగా పని చేస్తున్న వ్యక్తిని హత్య చేశాడు. వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు, కుటుంబ సభ్యుల ప్రాథమిక సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి. కడప నగరంలోని నిరంజన్‌నగర్‌లో చిట్వేలి భవానీశంకర్‌(30) తన భార్య బాబాబీ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి జీవనం సాగించే వాడు.

భవానీశంకర్‌ 14వ డివిజనల్‌లో వలంటీర్‌గా, అతని భార్య 13వ డివిజన్‌లో వలంటీర్‌గా పని చేస్తున్నారు. మరోవైపు భవానీశంకర్‌ ఎల్‌ఐసీ డివిజనల్‌ కార్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎల్‌ఐసీలోని ఓ గదిలో ఎల్‌ఐసీ వారి ఈడిఎంఎస్‌ డిజిటలైజేషన్‌ విభాగం టీం లీడర్‌గా వున్న గుజ్జలి మల్లికార్జున దగ్గర పార్ట్‌టైం జాబ్‌ చేసేవాడు. వారిద్దరూ స్నేహితులు. ఈ విభాగంలో గతంలో భవానీశంకర్‌ భార్య బాబాబీ కూడా పని చేసేది. ప్రస్తుతం మల్లికార్జున దగ్గర భవానీశంకర్‌తోపాటు మల్లికార్జున భార్య శైలజ, మల్లికార్జున స్నేహితుడు, ఆటోడ్రైవర్‌ రంజిత్‌కుమార్‌ పని చేస్తున్నారు. మల్లికార్జునకు, కలసపాడుకు చెందిన తన అక్క కుమార్తె శైలజకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె సంతానంగా ఉంది.

వివాహేతర సంబంధమే ప్రధాన కారణం
భవానీశంకర్‌ను అతని స్నేహితుడు మల్లికార్జున, మరో వ్యక్తి వల్లూరు మండలం పాపాఘ్నినగర్‌కు చెందిన రంజిత్‌కుమార్‌ అనే ఆటోడ్రైవర్‌తో కలిసి దారుణంగా హత్య చేశాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ సంఘటనకు కేవలం వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. భవానీశంకర్‌, మల్లికార్జున భార్య శైలజతో వివాహేతర సంబంధం కలిగి వున్నాడని తెలుసుకున్నాడు. ఈనెల 11వ తేదీ రాత్రి నుంచి తన భార్య శైలజతో గొడవపడ్డాడు. ఈ నెల 12 తేదీన ఉదయం 7:30 గంటల సమయంలో తన భార్య శైలజతో భవానీశంకర్‌ను చంపిన తరువాతే ఇంటిలో అడుగుపెడతానని శపథం చేసి వెళ్లాడు.

హత్య చేసేందుకు పథకం రచించాడు. తనతోపాటు వున్న రంజిత్‌కుమార్‌తో కలిసి ఆటోలో చింతకొమ్మదిన్నె మండలానికి వెళ్లాడు. అక్కడి నుంచి వైవీ స్ట్రీట్‌కు వచ్చి కత్తి, కొడవలిని తీసుకున్నాడు. తాను పని చేస్తున్న ఎల్‌ఐసీ ఆఫీసుకు వచ్చాడు. భవానీశంకర్‌కు ఫోన్‌ చేసి అత్యవసరంగా ఆఫీసుకు రావాలని పిలిచాడు. అతను గదిలోకి రాగానే గడియపెట్టి కత్తి, కొడవలితో దారుణంగా పొడిచాడు. అతను తేరుకునేలోపే మెడ, ఛాతీ, వీపు భాగాలపై కర్కశంగా నరికి చంపాడు. రక్తపు మడుగులో పడివుండగా.. రంజిత్‌కుమార్‌తోపాటు బయటకు వచ్చి పరారయ్యాడు.

ఈ సంఘటన ఉదయం 9 గంటల నుంచి 10 గంటల సమయం మధ్యలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న హతుని భార్య బాబాబీ, తన బంధువులతో పాటు మృతదేహం వద్దకు చేరుకుని బోరున విలపించారు. సంఘటన స్థలాన్ని కడప డీఎస్పీ ఎం.డి షరీఫ్‌, సీఐ ఎన్‌.వి నాగరాజు, ఎస్‌ఐలు మధుసూదన్‌రెడ్డి, రంగస్వామి, సిద్దయ్యలు తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అదే రోజు సాయంత్రం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిందితులు పోలీసుల అదుపులో వున్నట్లు సమాచారం.

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top