అసలు దొంగలు ఎవరో ? | - | Sakshi
Sakshi News home page

అసలు దొంగలు ఎవరో ?

Apr 4 2023 11:25 AM | Updated on Apr 4 2023 11:25 AM

- - Sakshi

ఈ చిత్రంలో కనిపించేది కడప పాత రిమ్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం. గతంలో ఇక్కడ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. పలు అంశాలు చర్చకు దారి తీశాయి. అప్పుడు ‘సాక్షి’ పలు సంచలన కథనాలను ప్రచురించింది. తరువాత కాలంలో ఆ కార్యాలయంలో పరిపాలన గాడిలో పడినట్లైంది. తాజాగా స్టాఫ్‌ నర్సుల నియామకాల ప్రక్రియ వివాదాస్పదంగా మారింది.

కడప రూరల్‌ : వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం (జోన్‌–4) పరిధిలో 291 కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సుల నియామకానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆ మేరకు కడపలోని ఆ శాఖ కార్యాలయానికి రాయలసీమలోని జిల్లాల నుంచి 11 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్‌ ఆధారంగా ఆ శాఖ అధికారులు జనవరి 17వ తేదీ నుంచి స్టాఫ్‌ నర్స్‌ల నియామకాలను చేపట్టారు. ఉద్యోగాలు పొందిన వారు రెండు నెలల నుంచి వేతనాలు కూడా పొందుతున్నారు.

అనుమానమే నిజమైంది...
చిత్తూరు జిల్లాలో పదవీ విరమణ పొందిన ఒక పోలీసు ఉద్యోగి కుమార్తెకి మంచి మార్కులు ఉన్నాయి. అయితే ఆమెకు ఉద్యోగం రాలేదు. ఇతరులకు వచ్చాయి. ఆ రిటైర్డ్‌ ఉద్యోగికి అనుమానం వచ్చింది. ఉద్యోగాలు పొందిన వారిపై సంబంధిత శాఖకు ఫిర్యాదు చేశారు. మొత్తం 15 మంది మార్కుల సర్టిఫికెట్స్‌ను డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీకి పంపారు. అందులో 8 మంది మార్కుల జాబితా శ్రీట్యాంపర్డ్‌శ్రీ (సర్టిఫికెట్‌ మార్ఫింగ్‌)గా నిర్ధారించారు. ఆ 8 మందిలో వైద్య విధాన పరిషత్‌ విభాగానికి చెందిన ఉద్యోగులు ఐదుగురు, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఉండగా, ఒక అభ్యర్థి జాబితాలో ఉన్నప్పటికీ మెరిట్‌ లేనందున ఉద్యోగం రాలేదు.

షోకాజ్‌ నోటీసుకు బదులు లేనందున...
డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ నుంచి ఆ 8 మంది నివేదిక కడప వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయానికి చేరింది. ఆ ఎనిమిది మందిలో ఐదుగురు వైద్య విధాన పరిషత్‌కు చెందిన వారు ఉన్నారు. ఆ ఉద్యోగులపై చర్యల నిమిత్తం నివేదికను వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌కు పంపారు. ఇక ఇద్దరు ఉద్యోగులు డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు చెందిన వారు తమ పరిధిలోకి రావడంతో వారికి షోకాజ్‌ నోటీసులను జారీ చేశారు. ఇంత వరకు వారి నుంచి సమాధానం లేకపోవడంతో వారిపై కేసులు బనాయించడానికి రంగం సిద్ధమైంది.

మరో బోగన్‌ ఉద్యోగ నియామకం..
ఈ బోగస్‌ మార్కుల సర్టిఫికెట్స్‌ బాగోతం బయట పడక ముందు. ఒక అభ్యర్థి తాను స్టాఫ్‌ నర్స్‌ పోస్టుకు ఎంపికై నట్లు, తనకు పోస్టింగ్‌ ఇవ్వాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు వెళ్లారు. ఆ నియామక పత్రం ప్రకారం నిర్దేశించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోస్టింగ్‌ లేదని అక్కడి అధికారులు గమనించి ఇక్కడ ఉన్న ప్రాంతీయ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఆ నియామక పత్రాన్ని గమనించిన అధికారులు అది ఒక బోగస్‌ నియామక పత్రంగా తేల్చారు. అనంతరం ఆమైపె అధికారులు కడప పోలీస్‌ స్టేషన్‌లోి ఫిర్యాదు చేశారు. కాగా ఈ బోగస్‌ ఉద్యోగ నియామక పత్రంపై సంబంధిత అధికారుల సిగ్నేచర్‌ (సంతకం) ఎవరిది ఉందనేది ఆసక్తిగా మారింది.

అక్రమాల వెనుక హస్తం ఎవరిదో..
మొత్తం ఈ బోగస్‌ వ్యవహారమంతా చిత్తూరు జిల్లా కేంద్రంగా సాగడం గమనార్హం. బోగస్‌ సర్టిఫికెట్లను పదుల సంఖ్యలో సృష్టించడం అంటే మాటలు కాదు. ఇదంతా ఎవరో బాగా అనుభవజ్ఞులైన వారి కనుసన్నల్లో జరుగుతున్నట్లుగా ఆ శాఖ ఉద్యోగులు అనుమానిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇంటి దొంగల పనా లేక బయటి దొంగల మాయాజాలమా. లేదంటే ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకమా.? అనేది తేలాలంటే సమగ్ర విచారణ చేపట్టాలని ఆ శాఖ ఉద్యోగులు కోరుతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అనేది ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

కేసులు బనాయించమని ఆదేశించాం
కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సు నియామకాల్లో బోగస్‌ మార్కుల జాబితాను సమర్పించి, మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాలు పొందారని ఫిర్యాదులు వచ్చాయి. మొత్తం 15 మందిలో 8 మంది మార్కుల జాబితాను ‘ట్యాంటర్డ్‌’ చేశారని డాక్టర్‌ వైఎస్సార్‌ యూనివర్సిటీ నుంచి నివేదిక వచ్చింది. ఇందుకు సంబంధించి షోకాజ్‌ నోటీసులకు బదులు ఇవ్వనందున, వారిపై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. మిగతా ఏడుగురి నివేదిక త్వరలో రానుంది. బోగస్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు, అందుకు సహకరించిన వారిపై కఠిన చర్యలు చేపడతాం.
డాక్టర్‌ కోటేశ్వరి, రీజినల్‌ డైరెక్టర్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement