యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నిత్యారాధనలు సంప్రదాయంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, ఆరాధన, స్వయంభూలకు నిజాభిషేకం, సహస్ర నామార్చన, కుంకుమార్చన నిర్వహించారు. ఇక ఆలయ ముఖ మండపంలోని ఉత్సవ మూర్తుల వద్ద సువర్ణ పుష్పార్చన వంటి పూజలు జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం జోడు సేవోత్సవం వంటి పూజలను జరిపించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.
కార్మికుల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం
యాదగిరిగుట్ట: ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాటం చేస్తున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న పేర్కొన్నారు. యాదగిరిగుట్ట డిపో వద్ద శనివారం ఆయన ఆర్టీసీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈయీ, టీఎంయూ, ఎన్‌ఎంయూ కూటమి అభ్యర్థులను త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మంగ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బోలగాని సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్లెం కృష్ణ, పట్టణ కార్యదర్శి బబ్బూరి శ్రీధర్, ఏఐటీయూసీ నాయకుడు గోపగాని రాజు, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నల్లమాస జగదీష్, వేముల సోమేశ్, సోకం వెంకన్న, టీఎంయూ డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ మొగిలి నరసయ్య, రమేష్, జి ఆర్ మోహన్ పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే ధ్యేయం
ఆలేరు : ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే ఏఐఎస్‌ఎఫ్ ధ్యేయమని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ స్పష్టం చేశారు. శనివారం ఆలేరులో నిర్వహించిన ఏఐఎస్‌ఎఫ్ నాలుగో మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. పాలకులు విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, నాయకులు చెక్క వెంకటేష్, చెడే చంద్రయ్య, చౌడబోయిన కనకయ్య, పోతు ప్రవీణ్, రవి, అభిలాష్, శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.


