భువనగిరిటౌన్ : జిల్లాలోని సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు,సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య విమర్శించారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం చేపట్టిన పాదయాత్రను శనివారం భువనగిరి పట్టణంలోని డా.బి.ఆర్. అంబేడ్కర్ చౌరస్తా వద్ద వారు జెండాలు ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కొండమడుగు నరసింహ అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభ సభలో సీతారాములు మాట్లాడుతూ రూ. 20 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో ఇప్పుడు వందల కోట్లకు పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా వరుణ యాగాలు చేస్తున్నారని, గోశాలలకు రూ.50 కోట్లు ఇస్తారు కానీ రైతుల సాగునీటికి నిధులు ఇవ్వరని ఎద్దేవా చేశారు. విషపూరిత మూసీ నీటితో ప్రజలు, పశువులు రోగాల పాలవుతుంటే సుందరీకరణ పేరుతో హైదరాబాద్ లో పర్యాటక హంగులు చేస్తున్నారని విమర్శించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన, గోదావరి అనుసంధానం చేస్తే 7 జిల్లాలకు మేలు జరుగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి కలలు కనే ఫ్యూచర్ సిటీపై పెట్టే శ్రద్ధలో సగం ఈ ప్రాజెక్టులపై పెడితే యాదాద్రి ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్నారు. సాగు తాగునీటి ప్రాజెక్టులపై చేస్తున్న 9 డిమాండ్లను అసెంబ్లీలో చర్చించాలన్నారు. ఈనెల 31న హైదరాబాద్‌లో నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ మాట్లాడుతూ జిల్లాలో 22 ప్రాజెక్టులు, కాల్వలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, నేతలు బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి ,ముత్యాలు, అంజిరెడ్డి, వెంకటేశు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య
ఫ భువనగిరిలో సీపీఎం పాదయాత్ర ప్రారంభం


