సంస్థాన్ నారాయణపురం: సర్వేల్ గురుకుల పాఠశాలను దత్తత తీసుకుని, పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. తాను చదువుకున్న సర్వేల్ గురుకుల పాఠశాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు వచ్చారు. ‘కలిసి ఎదుగుదాం.. కలిసి సాధిద్దాం’ అనే లక్ష్యంతో శనివారం పాఠశాలలో ‘5ఎస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 5ఎస్ కార్యక్రమంలో భాగంగా క్రమశిక్షణ, పరిశుభ్రత, అనవసర వస్తువుల తొలగింపు, పూర్వ విద్యార్థులతో అనుసంధానం, కలిసి ఎదుగుదాం–కలిసి సాధిద్దాం అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన స్పోర్ట్స్ డేలో బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. పూర్వ విద్యార్థుల 1976 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ (శ్రీరంగం) విరాళంగా అందించిన 28 ట్యాబ్‌లు, రెండు ఇన్వర్టర్లను ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా, క్రీడా వాతావరణం కల్పించేందుకు పూర్వ విద్యార్థులు మరింతగా ముందుకు రావాలని నిర్వాహకులు కోరారు. గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఉషారాణి.. మహేందర్‌రెడ్డికి రాఖీ కట్టి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టీ.శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ గంగారం, డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి, సీఐ సతీష్‌రెడ్డి, ఎస్‌ఐ పాండు, సర్వేల్ సర్పంచ్ చిలకరాజు చందనరాజులు పాల్గొన్నారు.
ఫ మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి


