● ఖననం చేసిన అటవీ శాఖ అధికారులు
నల్లగొండ : పట్టణంలోని ఎస్పీ కార్యాలయం ప్రహరీ సమీపంలో గురువారం ఉదయం జాతీయ పక్షి నెమలి కళేబరం లభ్యమైంది. ఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫుట్‌పాత్‌పై నెమలి చనిపోయి ఉండటాన్ని గమనించిన పోలీసులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రవీందర్ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు చనిపోయిన నెమలి కళేబరాన్ని స్వాధీనం చేసుకుని ఖననం చేశారు. లతీఫ్‌సాహెబ్ గుట్ట ప్రాంతం నుంచి ఆహారం కోసం వచ్చిన నెమలి ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇరువర్గాల ఘర్షణలో
ఏడుగురి బైండోవర్
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్‌లో గత సోమవారం ఇరువర్గాల నడుమ జరిగిన ఘర్షణలో ఏడుగురు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా గురువారం వారిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. తిరిగి ఎక్కడైనా అల్లర్లకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ (ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్) ఎదుట ఒక్కొక్కరిని రూ.2 లక్షల చొప్పున సంవత్సర కాలానికి బైండోవర్ చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా, బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు.


