రామన్నపేట : మండలంలోని వెల్లంకి గ్రామంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు గురువారం ఎస్‌ఐ జి. సతీష్ తెలిపారు. బుధవారం రాత్రి వెల్లంకిలోని ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం మేరకు దాడి చేయగా.. నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారియేందుకు యత్నించారని, వారిని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. వారి నుంచి రూ.1800 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.
నిర్మానుష్య ప్రాంతంలో
పశువుల అవశేషాలు
చిట్యాల : మండలంలోని వెలిమినేడు గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నార్లగుట్ట సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో గురువారం పశువుల అవశేషాలు లభ్యమయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు గోవధ చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా అవశేషాలను సంచుల్లో మూటకట్టి నార్లగుట్ట సమీపంలో సిమెంటు గూనల్లో దాచి ఉంచారు. గురువారం ఆ ప్రాంతంలో దుర్వాసన రావటంతో పలువురు సిమెంటు గూనలను పగులగొట్టి చూడగా అందులో పశువుల అవశేషాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
చికిత్స పొందుతూ మృతి
చౌటుప్పల్ : ద్విచక్ర వాహనం పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారం గ్రామానికి చెందిన రావుల శ్రీశైలం(33) గత నెల 28న ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వ్యవసాయ పొలం వద్దకు బయల్దేరాడు. పొలం సమీపంలోకి వెళ్లగానే అదుపుతప్పి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
వ్యక్తి అదృశ్యం
చివ్వెంల(సూర్యాపేట) : చివ్వెంల మండల కేంద్రానికి చెందిన బొప్పని దానియేలు ఈ నెల 3వ తేదీ నుంచి కనిపించడంలేదని అతడి కుమారుడు మధు గురువారం చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన దానియేలు తిరిగి రాలేదని, ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి. మహేశ్వర్ తెలిపారు. ఆచూకీ తెలిసిన 87126 86031 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ సూచించారు.
గుర్తుతెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
చిట్యాల : చిట్యాల రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్‌ఐ మామిడి రవికుమార్ తెలిపారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్లు ఉంటాయని, తెలుపు, నలుపు రంగుల చెక్స్ షర్ట్, నీలం రంగు ప్యాంట్ ధరించినట్లు పేర్కొన్నారు. అతడి కుడి చేతిపై అశోక చక్రం, చేతిముద్ర పచ్చబొట్టు, కుడి చేతి పిడికిలిపై పచ్చబొట్టు ఉన్నాయన్నారు. మృతదేహాన్ని నల్ల గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించామని, వివరాలు తెలిసిన వారు 87126 70187 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్‌ఐ సూచించారు.


