భార్యను హత్య చేసి ఉరేసుకున్న భర్త | - | Sakshi
Sakshi News home page

భార్యను హత్య చేసి ఉరేసుకున్న భర్త

Jul 10 2026 9:45 AM | Updated on Jul 10 2026 9:45 AM

తుంగతుర్తి : సంపాదించిన డబ్బంతా కుమార్తెకే ఇస్తుందనే కోపంతో భార్యను చంపి భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. తుంగతుర్తి సీఐ ఉపేందర్‌రావు, ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గొట్టిపర్తి గ్రామానికి చెందిన కోట సత్యనారాయణ (74), కనకలక్ష్మి (66) దంపతులు అల్లం ఎల్లిగడ్డ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారులిద్దరు జీవనోపాధి కొరకు ఒకరు సూర్యాపేటలో, మరొకరు తిరుమలగిరిలో ఉంటున్నారు. అల్లం ఎల్లిగడ్డ వ్యాపారం చేసి సంపాదించిన డబ్బును కనకలక్ష్మి ఎక్కువగా కుమార్తెకు ఇస్తుందని, అంతేకాకుండా కుమార్తెకు రూ.3 లక్షలతో తిరుమలగిరిలో ప్లాటు కొనుగోలు చేసి ఇచ్చిందని ఆమెతో భర్త కోటేశ్వరరావు తరచూ గొడవ పడుతుండేవాడు. భర్త వేధింపులు భరించలేక కనకలక్ష్మి నెల క్రితం పెద్ద కుమారుడు సోమేశ్వర్‌ దగ్గరకు వెళ్లింది. ఇటీవల పెద్ద మనుషులందరూ కలిసి పంచాయితీ పెట్టి కనకలక్ష్మిని తిరిగి గొట్టిమర్తికి తీసుకొచ్చారు. ఇదే విషయమై బుధవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య పంచాయితీ జరగడంతో కనకలక్ష్మి తన కుమారులకు ఫోన్‌ చేసింది. కుమారులిద్దరు కాన్ఫరెన్స్‌లో తల్లిదండ్రులతో మాట్లాడి ‘మీరు పంచాయితీ పెట్టుకోవద్దు.. మేము వస్తామని’ చెప్పారు. అదే సమయంలో కోటేశ్వరరావు ఫోన్‌లో మాట్లాడుతూ.. ‘మీ అమ్మ నేను చెప్పినట్లు వినడం లేదు, నాకు తెలియకుండా డబ్బులన్నీ అక్కకు ఇస్తుంది, ఎలాగైనా మీ అమ్మను చంపుతాను’ అని చెప్పడంతో కుమారులిద్దరు కలిసి తండ్రిని వారించి సర్ది చెప్పారు.

సూసైడ్‌ నోట్‌ గోడకు అంటించి..!

ఎలాగైనా భార్యను చంపాలని నిర్ణయించుకున్న కోటేశ్వరరావు బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో కనకలక్ష్మి తలపై కొట్టి హతమార్చాడు. అనంతరం కోటేశ్వరరావు సూసైట్‌ నోట్‌ రాసి ఇంట్లో ఉన్న గోడకు అంటించాడు. తన వద్ద రూ.4.90 లక్షలు అప్పు పత్రాలు ఉన్నాయని, రూ.9వేల నగదు ఉందని, ఆ సొమ్మును ఇద్దరు కొడుకులు చెరి సమానంగా తీసుకోవాలని, గొడవ పెట్టుకోవద్దని సూసైడ్‌ నోట్‌లో రాశాడు. 4.20 గంటలకు ఉరేసుకుంటున్నానని, దీనికి ఎవరూ బాధ్యులు కాదని, తాను చేసుకున్న కర్మ అని రాసి ఇంట్లో ఉన్న దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి కుమారులకు సమాచారం ఇచ్చారు. కుమారులిద్దరు వచ్చి చూడగా.. అప్పటికే కోటేశ్వరరావు, కనకలక్ష్మి మృతిచెంది ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్‌ పరిశీలించారు. మృతుల చిన్న కుమారుడు కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement