‘క్రిప్టో’లో పెట్టుబడి పేరుతో మోసం | - | Sakshi
Sakshi News home page

‘క్రిప్టో’లో పెట్టుబడి పేరుతో మోసం

Jul 10 2026 9:45 AM | Updated on Jul 10 2026 9:45 AM

నిందితుడి కోసం గాలిస్తున్నాం

ఆలేరు : ‘ఒక్క ఐడీతో మీ జీవితం మారిపోతుంది.. మూడేళ్లలో మూడు రెట్ల లాభం.. రోజూ డాలర్లలో ఆదాయం’ అంటూ అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి కోట్లాది రూపాయలతో పరారైన భారీ క్రిప్టో పెట్టుబడి మోసం ఆలేరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 500 మంది నుంచి రూ.10 కోట్లకు పైగా వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఐడీ క్రియేషన్‌కు రూ.3.20 లక్షలు

హైదరాబాద్‌లోని రామంతాపూర్‌కు చెందిన గౌస్‌ 2023 ఫిబ్రవరిలో ఆలేరు ప్రాంతంలో ‘యూనిటీ మెటా క్రిప్టో’ పేరుతో పెట్టుబడి పథకాన్ని ప్రారంభించాడు. ఒక్కో ఐడీ క్రియేట్‌ చేయడానికి రూ.3.20 లక్షలు వసూలు చేశారు. ఆ మొత్తానికి 1,167 క్రిప్టో కాయిన్లు ఇస్తామని, వాటిని సేఫ్‌పాల్‌ యాప్‌లో స్టేక్‌ చేస్తే రోజూ 10 కాయిన్లు వస్తాయని నమ్మబలికారు. ఆ కాయిన్లను ‘కాయిన్‌ స్టోర్‌’ ఎక్స్ఛేంజ్‌లో ఒక్కోటి 6 నుంచి 10 డాలర్లకు విక్రయించుకోవచ్చని ఆశ చూపారు. ఈ మాయమాటలు నమ్మిన ఆలేరు పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాలకు చెందిన వందలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు, చిరుద్యోగులు, వ్యాపారులు తమ డబ్బును ఇందులో పెట్టుబడిగా పెట్టారు. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇళ్ల నిర్మాణం కోసం దాచుకున్న డబ్బుతో కొందరు రెండు, మూడు ఐడీలు సైతం తీసుకున్నారు. గౌస్‌ బంధువు అవుతాడని భావిస్తున్న ఓ ప్రభుత్వ అధికారి (యూనిఫాం సర్వీస్‌) ఈ నెట్‌వర్క్‌ విస్తరణలో కీలకపాత్ర పోషించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా మోసం

నిజానికి ఈ స్కీం కార్యకలాపాలు 2024 సెప్టెంబర్‌లోనే నిలిచిపోయినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని దాచిపెట్టిన నిర్వాహకుడు గౌస్‌, ఆ తర్వాత కూడా కొత్త సభ్యుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి తన వద్ద ఉన్న పాత కాయిన్లనే వారికి అంటగట్టాడు. 2025 మే 21 నాటికి తమ వద్ద ఉన్న కాయిన్లకు మార్కెట్‌లో ఎలాంటి విలువ లేదని గుర్తించిన బాధితులు నిర్వాహకుడిని నిలదీశారు. 2025 డిసెంబర్‌ 31లోగా పెట్టుబడులన్నీ తిరిగి చెల్లిస్తానని అతడు హామీ ఇచ్చాడు. ఆ తర్వాత గడువు దాటవేస్తూ కాలయాపన చేశాడు. చివరకు, ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘5 స్టార్‌, 7 స్టార్‌ అచీవర్లే తమ కింద చేరిన సభ్యుల డబ్బులు చెల్లించాలి’ అంటూ కంపెనీ సీఈఓ పేరిట వాయిస్‌ మెసేజ్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 10 నుంచి గౌస్‌ కనిపించకుండా పోయాడు.

ఆర్థిక సంక్షోభంలో 500 కుటుంబాలు

ఈ మోసం కారణంగా సుమారు 500 కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. లాభాల ఆశతో బ్యాంకు రుణాలు తెచ్చి, బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన వారంతా ఇప్పుడు కన్నీరుమున్నీరవుతున్నారు. గురువారం ఆలేరు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన బాధితులు ఎండీ మహమూద్‌, బూషిగంపల శ్రీశైలం, సుంకరి ప్రదీప్‌గౌడ్‌, పల్లెకడి శివకుమార్‌గౌడ్‌, వి. రవీందర్‌ తదితరులు తమ గోడును వివరించారు.

రూ.10 కోట్లతో ఉడాయించిన

నిర్వాహకుడు

‘యూనిటీ మెటా క్రిప్టో’ పేరిట

500 మందికి కుచ్చుటోపీ

పరారీలో ప్రధాన నిందితుడు

డీజీపీ కార్యాలయంలోనూ ఫిర్యాదు

ఈ వ్యవహారంపై మే 13న బాధితులు ఆలేరు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ప్రధాన నిందితుడు గౌస్‌, అతడి భార్య వజీదాపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు పలుమార్లు జిల్లా ఎస్పీ అక్షాంశ్‌యాదవ్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. జూన్‌ 18న డీజీపీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు. దర్యాప్తు వేగవంతం చేసి తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

క్రిప్టో కాయిన్‌ పెట్టుబడి పేరుతో మోసానికి పాల్పడినట్లు బాధితుల ఫిర్యాదు మేరకు గౌస్‌, అతడి భార్యపై కేసు నమోదు చేశాం. వజీదాను రిమాండ్‌కు తరలించగా, ప్రస్తుతం ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు గౌస్‌ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాం.

– యాలాద్రి, సీఐ, ఆలేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement