ఐదు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

ఐదు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌

Feb 14 2026 10:20 AM | Updated on Feb 14 2026 10:20 AM

ఐదు మ

ఐదు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌

భువనగిరి: మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా కొనసాగింది. ఆరు మున్సిపాలిటీలకు గాను ఐదింటిలో కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ పదవులను కై వసం చేసుకోవడానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌కు మించి వార్డులను సాధించింది. పోచంపల్లిలో మాత్రం ఏపార్టీకి కూడా పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్‌, మోత్కూరు మున్సిపాలిటీలకు చెందిన ఓట్ల లెక్కింపు శుక్రవారం జిల్లా కేంద్రంలోని దివ్య బాల విద్యాలయంలో నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మొదటగా యాదగిరిగుట్టకు చెందిన మొదటి వార్డు ఫలితం ఉదయం 9.15 గంటలకు వెల్లడించారు. ఆ తర్వాత ఆలేరు, మోత్కూరు, పోచంపల్లి, చౌటుప్పల్‌, చివరిగా భువనగిరి మున్సిపాలిటీకి చెందిన ఫలితాలు వెలువడ్డాయి.

మెజార్టీ సాధించడంలో సక్సెస్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీపై చేయిసాధించింది. చాలా చోట్ల బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు పెద్దగా పోటీ ఇవ్వకలేకపోయారు. దీంతో భువనగిరి, చౌటుప్పల్‌, మోత్కూర్‌, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయదుందుభి మోగించింది. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీతో పాటు మోత్కూరు, చౌటుప్పల్‌ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ వార్డులు సాధించడంలో ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేల్‌, రాజగోపాల్‌రెడ్డి సక్సెస్‌ అయ్యారు.

102 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తే

ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 104 వార్డులుండగా ఇందులో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 10వ వార్డు, చౌటుపల్‌లో 17వ వార్డుకు చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 102 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 99 వార్డుల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేయగా 62, బీజేపీ 90 వార్డుల్లో పోటీ చేయగా 12, బీఆర్‌ఎస్‌ 91 స్థానాలలో పోటీ చేయగా 19, సీపీఎం 8 స్థానాలలో పోటీ చేస్తే 1, సీపీఐ 2 స్థానాలలో పోటీ చేస్తే 1, స్వతంత్రలు 63 స్థానాల్లో పోటీ చేయగా ఏడుగురు అభ్యర్థులు గెలుపొందారు. ఇందులో యాదగిరిగుట్టలో మొదటి సారి బీజేపీ అభ్యర్థులు ఇద్దరు విజయం సాధించి మున్సిపాలిటీల్లో ఖాతా తెరిచారు.

ఏడుచోట్ల స్వతంత్రుల విజయం

మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏడు వార్డుల్లో స్వత్రంత అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో భువనగిరిలో 5, భూదాన్‌పోచంపల్లి, మోత్కూర్‌లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరిలో పార్టీల నుంచి టికెట్‌ అశించి రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచి విజయం సాధించారు.

ఐదు చోట్ల మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి..

భువనగిరి మున్సిపాలిటీలో చైర్మన్‌ పదవి కోసం మ్యాజిక్‌ ఫిగర్‌ 18, చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో 11, ఆలేరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట, మోత్కూరులో 7 చొప్పున మ్యాజిక్‌ ఫిగర్‌ అవసరం. ఆయా మున్సిపాలిటీల్లో భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌, మోత్కూరు, ఆలేరులో చైర్మన్‌ పదవిని దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ను మించి వార్డులను అధికార పార్టీ గెలుపొందింది, భూదాన్‌పోచంపల్లిలో మ్యాజిక్‌ ఫిగర్‌కు ఒక సీటు తక్కువగా ఉంది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ లభించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా జింకల లావణ్య పోటీ చేసి విజయంసాధించారు. ప్రస్తుతం ఆమెను కాంగ్రెస్‌ పార్టీవారు క్యాంప్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఆమె కాంగ్రెస్‌ గూటికి చేరితే జిల్లాలో ఉన్న ఆరు మున్సిపాలిటీలు హస్తగతం కానున్నాయి.

క్యాంపులకు అభ్యర్థులు

ఇప్పటికే యాదగిరిగుట్ట, ఆలేరు, చౌటుప్పల్‌కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు క్యాంప్‌కు తరలివెళ్లగా తాజాగా భువనగిరి, పోచంపల్లికి చెందిన అభ్యర్థులను విజయం సాధించిన అనంతరం క్యాంప్‌కు తరలించారు. భువనగిరి మున్సిపాలిటీలో గెలుపొందిన 22 మంది కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అధ్వర్యంలో ప్రత్యేక బస్సులో రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతంలో ఉన్న ఓ ఫాంహౌస్‌కు వెళ్లినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి వరకు చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో క్యాంపులోనే నిర్ణయం తీసుకుని సీల్డ్‌కవర్‌తో ఈ నెల 16న సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.

చైర్మన్‌ పదవి వరించేదెవరికో..

ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్‌ పదవి ఎవరిని వరిస్తుందోనన్న చర్చ జరుగుతోంది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 10 వార్డు నుంచి ఏకగ్రీవమైన కాంగ్రెస్‌ అభ్యర్థి గుండ్లపల్లి వాణి చైర్మన్‌గా, ముక్కెర్ల మల్లేష్‌ను వైస్‌ చైర్మన్‌ చేస్తారని ప్రచారం జరిగింది. ఆలేరులో 7వ వార్డుకు చెందిన బాలమణి, చౌటుప్పల్‌ మున్సిపాలిటీల్లో 7, 9, 13 వార్డులకు చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థులు, మోత్కూర్‌లో 2,6 వార్డులకు చెందిన అభ్యర్థులు, భువనగిరిలో 11,29,35 వార్డులకు చెందిన అభ్యర్థులు చైర్మన్‌ రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ వీరిలో ఎవరు చైర్మన్‌ అవుతారో ఈ నెల 16న తేలనుంది.

ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్‌

ఆరుమున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగించేందుకు మూడంచెల పోలీస్‌ భద్రతను ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ హనుమంతరావుతో పాటు ఎస్సీ అక్షాంశ్‌ యాదవ్‌ ఎప్పటికప్పుడు లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు.

ఫ భూదాన్‌పోచంపల్లిలో ఏ పార్టీకి రాని పూర్తిస్థాయి మెజారిటీ

ఫ 20లోపు స్థానాలకే పరిమితమైన బీఆర్‌ఎస్‌, బీజేపీ

ఫ క్యాంప్‌లకు తరలివెళ్లిన అధికార పార్టీ అభ్యర్థులు

ఐదు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌1
1/2

ఐదు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌

ఐదు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌2
2/2

ఐదు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement