కాంగ్రెస్‌ను తట్టుకోలేరు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను తట్టుకోలేరు

Feb 14 2026 10:20 AM | Updated on Feb 14 2026 10:20 AM

కాంగ్రెస్‌ను తట్టుకోలేరు

కాంగ్రెస్‌ను తట్టుకోలేరు

ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట: మున్సిపల్‌ ఎన్నికల్లో ఆలేరు, యాదగిరిగుట్టలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి వచ్చిన కాంగ్రెస్‌ను తట్టుకోలేదని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. భువనగిరి శివారులోని దివ్యబాల విద్యాలయంలో ఓట్ల లెక్కింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నా.. ఓటర్లు మాత్రం ప్రజా ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారన్నారు. ఆలేరు, యాదగిరిగుట్టలో వచ్చిన ఫలితాలు సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులకు నిదర్శనం అని అన్నారు. ఆలేరు, యాదగిరిగుట్టలో సాధించిన విజయాన్ని సీఎం రేవంత్‌రెడ్డికి అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ జెండాను ఎగురవేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఎక్కడ పోటీ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌ రెండున్నర ఏళ్ల పాలన చూసి ప్రజలు మంచి విజయాన్ని అందించారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం సాధించేందుకు సహకరించిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్‌ శ్రేణుల

గెలుపు సంబరాలు

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ అధిక వార్డులు కై వసం చేసుకోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. బాణ సంచా కాల్చుతూ, నృత్యాలు చేస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అధిక సీట్లు గెలుచుకోవడమే కాకుండా చైర్మన్‌ పీఠాన్ని సైతం దక్కించుకోవడంతో మరింత ఉత్సాహంగా సంబరాలు చేశారు. ఇక కౌంటింగ్‌ కేంద్రం వద్ద గెలిచిన అభ్యర్థులతో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య వచ్చి ధ్రువ పత్రాలను తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించారన్నారు.

ఇద్దరికి ఒక్కొక్క ఓటు.. మరొకరికి రెండు..

మోత్కూరు : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో ఇద్దరు అభ్యర్థులకు ఒక్కొక్క ఓటు, మరొక అభ్యర్థికి రెండు ఓట్లు వచ్చాయి. 1వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గుమ్మడెల్లి పరశురాములు పోటీ చేశారు. ఈ వార్డులో ఆయనకు ఓటు హక్కులేదు. కానీ ఒక్క ఓటు రావడం విశేషం. 3వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి రేవల్లి రవిప్రసాద్‌కు ఒక్క ఓటు, 2వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బోయినపల్లి లక్ష్మికి రెండు ఓట్లు వచ్చాయి.

యాదగిరి క్షేత్రంలో లక్ష పుష్పార్చన

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో లక్ష పుష్పార్చన పూజను ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారంగా నిర్వహించారు. శుక్రవారం ఏకాదశి కావడంతో ఆలయ ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చన మూర్తులకు విశేషంగా పూజలు చేసి, వివిధ రకాల పుష్పాలు, తులసీ దళాలతో లక్ష పుష్పార్చన చేపట్టారు. ఇక ఆలయాన్ని వేకువజామునే తెరచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, సహస్రనామార్చన జరిపించారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణ వేడుకలను చేపట్టారు. శుక్రవారం ఆండాళ్‌ అమ్మవారికి విశేషమైన రోజు కావడంతో అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించి, అద్దాల మండపంలో ఊంజల్‌ సేవోత్సవాన్ని జరిపించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

మట్టపల్లిలో నిత్యకల్యాణం

మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం అనంతరం కల్యాణం జరిపి గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. తర్వాత నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement