7వ వార్డులో దోబూచులాడిన విజయం
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు (లక్కారం)కు సంబంధించిన శుక్రవారం జరిగిన కౌంటింగ్‌లో ఫలితం దోబూచులాడింది. మూడు పర్యాయాలు ఓట్లను లెక్కించిన అనంతరం తుది ఫలితాన్ని ప్రకటించారు. వార్డులో 1324ఓట్లకు గాను 1232 పోలుకాగా 1221 చెల్లుబాటయ్యాయి. అందులో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కానుగు యాదమ్మకు 603 ఓట్లు లభించగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసర్ల మంజులకు 602 ఓట్లు లభించాయి. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి రీకౌంటింగ్ కోరారు. ఆ క్రమంలో మరోసారి ఓట్లను లెక్కించారు. లెక్కింపులో బండిళ్లలో కాంగ్రెస్‌కు చెందిన ఓ ఓటు లభించింది. దాంతో ఇరువురు అభ్యర్థులకు 603 చొప్పున వచ్చాయి. ఈ సమయంలో మూడో సారి ఓట్లను లెక్కిస్తుండగా బీఆర్‌ఎస్ ఓట్లలో స్వస్తిక్ గుర్తు సరిగా లేని రెండు ఓట్లు గుర్తించి వాటిని పక్కనపెట్టారు. దాంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసర్ల మంజుల రెండుఓట్ల తేడాతో విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. తమకు అన్యాయం జరిగిందని బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, పోలింగ్ ఏజెంట్లు వాదనకు దిగారు.


