ఆధారం లేని చిన్నారులు
మర్రిగూడ: నా అనుకునే వాళ్లు తోడుగా లేకపోవడంతో చిన్నారులిద్దరూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారి నానమ్మే కంటికి రెప్పలా చూసుకుంటుంది. చిన్నారుల తండ్రి గతేడాది మృతిచెందగా తల్లి సాకలేక తన పుట్టింటికి వెళ్లింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొల్లపడకల్ గ్రామానికి చెందిన గుగ్గిళ్ల లక్ష్మమ్మకు 60 సంవత్సరాలు. ఆమె భర్త పదేండ్ల క్రితం మృతిచెందాడు. తన కొడుకు ఏడాది క్రితం మృత్యువాతపడ్డాడు. అప్పటి నుంచి దిక్కుతోచని స్థితిలో తన కూతురు ఉంటున్న సరంపేట గ్రామానికి వచ్చి ఆరునెలలుగా ఇక్కడే ఉంటున్నారు.
సరంపేటలో జీవనం.
గుగ్లిళ్ల లక్ష్మమ్మ మర్రిగూడ మండలంలోని సరంపేటలో తన కుమార్తె సంధ్య వద్దకు చేరుకుని సమీపంలోని పూరి గుడిసె నిర్మించుకుని నివసిస్తున్నారు. లక్ష్మమ్మ కూలీ పనులు చేసుకుంటూ ఏడేళ్ల మనుమరాలైన వెన్నెల, ఆరేళ్ల వయసున్న నందును సరంపేట ప్రాథమిక పాఠశాలలో చదివిస్తోంది. నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారులు, వృద్ధురాలికి స్థానిక నాయకులు, అధికారులు సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నా ఊపిరి ఉన్నంతవరకు చూసుకుంటా
దాతలు సహకారం అందిస్తే గూడు ఏర్పాటు చేసుకుని నా మనుమడు, మనుమరాలిని చూసుకుంటూ బడికి పంపుతా. వారికి తల్లిదండ్రులు లేరాయే, నాకు చేతకాకపాయే. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. దాతల సహకరించి గూడు ఏర్పాటు చేస్తే నా ఊపిరి ఉన్నంతవరకు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటా. – గుగ్గిళ్ల లక్ష్మమ్మ
గతేడాది తండ్రి మృతి పిల్లలను సాకలేక పుట్టింటికి వెళ్లిన తల్లి
అన్నీ తానై చిన్నారుల ఆలనాపాలన చూసుకుంటున్న నానమ్మ
ఆధారం లేని చిన్నారులు


