పట్టణానికి తిరుగు ప్రయాణం
ఉదయం నుంచే రద్దీ
రామగిరి(నల్లగొండ), చౌటుప్పల్, కేతేపల్లి, కోదాడరూరల్, చిట్యాల : సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వచ్చిన ప్రజలు తిరుగుప్రయాణం అయ్యారు. దీంతో హైదరాబాద్– విజయవాడ జాతీయరహదారి శనివారం వాహనాలతో రద్దీగా మారింది. వాహనాల రద్దీకి అనుగుణంగా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌గేట్ వద్ద ఉన్న 12 టోల్ కౌంటర్లకుగాను ఏడు కౌంటర్‌లను హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు కేటాయించారు.
భారీ వాహనాల నిలిపివేత
జాతీయ రహదారిపై రద్దీ నేపథ్యంలో భారీ వాహనాలను పోలీసులు కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద నిలిపివేశారు. చిట్యాల, పెద్దకాపర్తి గ్రామాల వద్ద అండర్‌పాస్ వంతెన పనులు జరుగుతున్నందున ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండటంతో ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదేశాల మేరకు భారీ వాహనాలను టోల్‌ప్లాజా వద్ద ఆపివేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ట్రాలీ, కంటైనర్, ట్యాంకర్ వంటి భారీ సైజు లారీలను వందల సంఖ్యలో టోల్‌ప్లాజా వద్ద ఖాళీ స్థలంలో నిలిపివేయించారు. ప్రమాదాలకు నిలయంగా మారిన కోదాడలోని కట్టకమ్ముగూడెం క్రాస్‌రోడ్‌ను పోలీసులు పూర్తి మూసి వేశారు. వాహనాలను హుజూర్‌నగర్ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లే విధంగా దారి మళ్లించారు. అదే విధంగా విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న భారీ వాహనాలు లారీలు, ట్రక్కులు వంటి వాహనాలను గుడిబండ ఫ్‌లైఓవర్ బ్రిడ్జి వద్ద దారి మళ్లించి హుజూర్‌నగర్, మిర్యాలగూడెం మీదగా వెళ్లాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు. చిట్యాలలో, పెద్దకాపర్తిలో జాతీయ రహదారిపై అండర్ బ్రిడ్జి రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఇరుకుగా ఉండే సర్వీస్‌రోడ్డులో వాహనాలు బారులుదీరాయి. పలు చోట్ల కార్లు బ్రేక్ డౌన్ అయ్యాయి. సాయంత్రం సమయానికి ట్రాఫిక్ పెరిగిపోవటంతో విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలను చిట్యాలలో భువనగిరి రోడ్డు మీదుగా మళ్లించారు. నల్లగొండ నుంచి హైదరాబాద్ మధ్య నడిచే ఆర్టీసీ బస్సులను దారి మళ్లించారు. నల్లగొండ డిపో నుంచి హైదరాబాద్ మధ్య నడిచే అన్ని బస్సులను నార్కట్‌పల్లి అద్దంకి హైవే పై ట్రాఫిక్ దృష్ట్యా ఆర్టీసి అధికారులు వయా మునుగోడు నారాయణపూర్ గుండా మళ్లించారు.
ఫ పండుగ ముగియడంతో స్వగ్రామాల నుంచి పట్టణానికి పయనం
ఫ హైదరాబాద్– విజయవాడ రహదారిపై పెరగిన వాహనాల రద్దీ
ఫ క్రాసింగ్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
ఫ భారీ వాహనాలు కోదాడ నుంచి హుజూర్‌నగర్ వైపు దారి మళ్లింపు
చౌటుప్పల్‌లోని హైవేపై విపరీతమైన రద్దీ ఏర్పడడంతో చాలా వాహనాలు పట్టణంలోని సర్వీస్‌రోడ్డు మీదుగా వెళ్లాయి. పలు జంక్షన్‌లను మూసివేశారు. మండల పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ మార్గంలో అదనపు టోల్ బూత్‌లను కేటాయించారు. శుక్రవారం 52500 వాహనాలు టోల్‌ప్లాజా మీదుగా రాకపోకలు సాగించగా, శనివారం సాయంత్రం 6గంటల వరకు 45600వాహనాలు రాకపోకలు సాగించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను చాలాచోట్ల దారి మళ్లించడంతో ఈ మార్గంలో చాలా మేరకు రద్దీ తగ్గింది. చౌటుప్పల్ మండలంలోని కై తాపురం వద్ద హైదరాబాద్ మార్గంలో వరుసగా నాలుగు కార్లు ఒకదాని వెనుక మరొకటి ఢీకొనడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎల్లగిరి శివారులో పెట్రోల్‌బంక్ ఎదురుగా హైదరాబాద్ మార్గంలో డీసీఎం వాహనం నడిరోడ్డులో బ్రేక్ డౌన్ కావడంతో ఎల్లంబావి శివారు వరకు వాహనాలు జామ్ అయ్యాయి.
పట్టణానికి తిరుగు ప్రయాణం


