వైభవంగా గోదాదేవికి నిరాటోత్సవాలు
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గోదాదేవి అమ్మవారి నీరాటోత్సవాలను మంగళవారం ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి పంచామృతాలతో నవ కలశ స్నపనం చేపట్టారు. అనంతరం తిరుమాడ వీధుల్లో స్వామి, అమ్మవార్లను గజ వాహనంపై ఊరేగించారు. ఆ తర్వాత సంప్రదాయ పూజలు చేశారు. మధ్యాహ్నం తిరుప్పావై మండపంలో తిరువారాధన ఆరగింపు, తీర్ధ ప్రసాద గోష్ఠి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రచార్యులు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహామూర్తి, ఆలయ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నేడు గోదాదేవి కల్యాణం
ధనుర్మాసంలో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో నేడు గోదాదేవి కల్యాణం జరిపించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. సాయంత్రం 7 గంటలకు కల్యాణం నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈ నెల 15న మధ్యాహ్నం ఒడి బియ్యం కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.


